: జగన్ ఆస్తుల స్వాధీనానికి ఈడీ సిద్ధం.. పది రోజుల్లో జగన్ ఇల్లు, ‘సాక్షి’ కార్యాలయం ఈడీ చేతుల్లోకి!
జగన్ ఆస్తుల స్వాధీనానికి ఎన్‌ఫోర్స్‌మెంట్ డైరెక్టరేట్(ఈడీ) కౌంట్‌డౌన్ మొదలుపెట్టింది. మరో పది రోజుల్లో ఆయన ఇల్లు, ‘సాక్షి’ ప్రధాన కార్యాలయాన్ని స్వాధీనం చేసుకునేందుకు ఈడీ రంగం సిద్ధం చేసింది. ఆస్తుల స్వాధీనానికి సహకరించాలంటూ గురువారం ఈడీ జగన్‌కు నోటీసులు జారీ చేసింది. జగన్ నివాసంతోపాటు, సాక్షి కార్యాలయానికి వెళ్లిన అధికారులు నోటీసులు అందజేశారు. అనంతరం జగన్‌మోహన్‌రెడ్డికి చెందిన ఏయే ఆస్తులను స్వాధీనం చేసుకోబోతున్నదీ ప్రకటన కూడా విడుదల చేశారు. వాస్తవానికి ఆస్తుల స్వాధీనానికి ఈడీ నెలన్నర సమయం ఇస్తుంది. అయితే అత్యంత తీవ్రమైన నేరాల్లో కేవలం పదిరోజులు మాత్రమే గడువు ఇస్తుంది. ఇప్పుడు జగన్ విషయంలో అదే జరిగింది. ఈడీ నోటీసులు అందడంతో జగన్ శిబిరంలో కలకలం మొదలైంది.
నోటీసులు అందుకున్న జగన్ శిబిరానికి ఏం చేయాలో పాలుపోవడం లేదు. ఎలా స్పందించాలన్న దానిపై తర్జనభర్జన పడుతోంది. హైకోర్టును ఆశ్రయించాలన్నా సోమవారం వరకు వేచి ఉండాల్సిన పరిస్థితి. అప్పటికి పుణ్యకాలం కాస్తా గడిచిపోతుందని భయపడుతోంది. ఈనెల 20 లోపు ఈడీ నోటీసులపై స్టే తెచ్చుకోవాల్సిన పరిస్థితి జగన్ శిబిరాన్ని కలవర పెడుతోంది. కోర్టు స్టే ఇవ్వకుంటే పరిస్థితి ఏంటన్న దానిపై ఆందోళన మొదలైంది. హైకోర్టు కనుక స్టే ఇవ్వకుంటే సుప్రీంకోర్టును ఆశ్రయించేంత సమయం ఉంటుందా? లేదా? అన్నదానిపై జోరుగా చర్చలు జరుగుతున్నాయి. ఈడీ కనుక ఆస్తులు స్వాధీనం చేసుకుంటే ప్రజల్లో అది జగన్‌కు ప్రతికూల అంశంగా మారుతుందని కొందరు వైసీపీ నేతలు అభిప్రాయపడుతున్నారు. అందుకే వీలైనంత త్వరగా స్టే తెచ్చుకునేందుకే ప్రయత్నిస్తున్నారు.