Personal Finance: సేవింగ్ అకౌంట్‌లో గరిష్ఠంగా ఎంత డబ్బు ఉండొచ్చు?.. ట్యాక్స్ రూల్స్ ఏంటి?

total cash deposit  should not exceed Rs 10 lakh in financial year
  • ఒక ఆర్థిక సంవత్సరంలో గరిష్ఠంగా రూ.10 లక్షల వరకు డిపాజిట్‌‌కు ఛాన్స్
  • పరిమితి మించితే ఆదాయ పన్ను విభాగానికి బ్యాంకుల సమాచారం
  • తగిన ఆధారాలతో వివరణ ఇవ్వాల్సి ఉంటుందంటున్న నిబంధనలు
సేవింగ్ బ్యాంక్ అకౌంట్‌లో గరిష్ఠంగా ఎంత నగదు ఉంటే ఆదాయ పన్ను వర్తిస్తుంది?. ఎంత సొమ్ము ఉంటే ఆదాయ పన్ను అధికారులు అకౌంట్‌ను పరిశీలిస్తారు? అనే సందేహాలు మీకెప్పుడైనా వచ్చాయా?. అయితే ఆదాయ పన్ను రూల్స్ గురించి తెలుసుకోవాల్సిందే. 

ఆదాయపు పన్ను నిబంధనల ప్రకారం... ఒక ఆర్థిక సంవత్సరంలో ఒక వ్యక్తి తన సేవింగ్ అకౌంట్‌లో గరిష్ఠంగా రూ.10 లక్షలకు మించకుండా నగదు డిపాజిట్ లేదా విత్‌డ్రా చేసుకోవచ్చు. ఈ పరిమితిని మించితే ఆదాయపు పన్ను శాఖ పరిశీలన చేస్తుంది.

ఇక రోజువారీ పరిమితులను పరిశీలిస్తే ఆదాయపు పన్ను చట్టంలోని సెక్షన్ 269ఎస్‌టీ నిబంధన ప్రకారం.. ఒక వ్యక్తి రోజుల్లో గరిష్ఠంగా రూ.2 లక్షల వరకు లావాదేవీలు నిర్వహించవచ్చు. ఖాతాదారులు అంతకంటే ఎక్కువ సొమ్ము పొందడానికి అవకాశం ఉండదు. ఒక ఆర్థిక సంవత్సరంలో ఒక వ్యక్తి  తన అన్ని పొదుపు ఖాతాలలో కలిపి రూ.10 లక్షల కంటే ఎక్కువ నగదు డిపాజిట్ చేస్తే సంబంధిత బ్యాంకులు ఆదాయపు పన్ను విభాగానికి సమాచారం అందించాల్సి ఉంటుంది.

ఆదాయపు పన్ను చట్టంలోని సెక్షన్ 114బీ ప్రకారం...  బ్యాంకులు, ఆర్థిక సంస్థలు డిపాజిట్ల వివరాలను ఆదాయపు పన్ను విభాగానికి వెల్లడించాలి. ఇక ఒక రోజులో రూ. 50,000 కంటే ఎక్కువ నగదు డిపాజిట్ చేస్తే తప్పనిసరిగా పాన్ నంబర్‌ను అందించాల్సి ఉంటుందని ఆదాయ పన్ను నిబంధనలు స్పష్టం చేస్తున్నాయి. 

అధిక విలువైన లావాదేవీల విషయంలో ఆదాయపు పన్ను నోటీసులు అందితే ఆదాయానికి సంబంధించిన ఆధారాలను దగ్గర ఉంచుకొని చూపించాలి. బ్యాంక్ స్టేట్‌మెంట్‌లు, పెట్టుబడి లేదా ఆదాయ రికార్డులు భద్రపరచుకొని దగ్గర పెట్టుకోవాలి. నగదుకు సంబంధించిన లావాదేవీలు తెలియకపోతే  పన్ను సలహాదారులను సంప్రదించి సూచనలు పొందడం ఉత్తమం.
Personal Finance
Business News
Income Tax

More Telugu News