telugu language: తెలుగు భాషపై ఈ మధ్య కాలంలో దాడి జరిగింది: జస్టిస్ ఎన్వీ రమణ

justice nv ramana urges for telugu language preservation and university establishment
  • తెలుగు భాషపై కీలక వ్యాఖ్యలు చేసిన విశ్రాంత సీజేఐ జస్టిస్ ఎన్వీ రమణ
  • ఈ మధ్యకాలంలో తెలుగు భాషపై దాడి జరిగిందని ఆవేదన వ్యక్తం చేసిన జస్టిస్ ఎన్వీ రమణ
  • పక్క రాష్ట్రాలలో వారు తమ భాష కోసం ఎంత కృషి చేస్తున్నారో చూసి నేర్చుకోవాలన్న జస్టిస్ ఎన్వీ రమణ
తెలుగు భాషపై సుప్రీం కోర్టు మాజీ ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ ఎన్వీ రమణ కీలక వ్యాఖ్యలు చేశారు. తెలుగు భాష కనుమరుగయ్యే పరిస్థితి ఉందని, ఇదే జరిగితే తెలుగు జాతి అంతరించిపోయినట్లేనని ఆయన పేర్కొన్నారు. కడప పట్టణంలోని సీపీ బ్రౌన్ గ్రంథాలయంలో జరిగిన డాక్టర్ జానమద్ది హనుమచ్ఛాస్త్రి శతజయంతి వేడుకలో ఆయన పాల్గొని ప్రసంగించారు. 

తెలుగు భాష సంగీతమయినటువంటిదని అన్నారు. ఈ మధ్య కాలంలో తెలుగు భాషపై దాడి జరిగిందని ఆవేదన వ్యక్తం చేశారు. తెలుగు రాష్ట్రాలు విడిపోయిన తర్వాత తెలుగు భాషపై పట్టు వీడుతుందని అన్నారు. రాజకీయ నాయకులు సంక్షేమం, అభివృద్ధి గురించి ఆలోచన చేస్తున్నారే కానీ భాష గురించి ఆలోచించడం లేదని ఆవేదన వ్యక్తం చేశారు. కొంత మంది ముఖ్యమంత్రులు మాత్రమే తెలుగు భాష గురించి పట్టించుకున్నారని అన్నారు.
 
విదేశీయుడైన బ్రౌన్ తెలుగు భాష గురించి చేసిన కృషి అభినందనీయమని అన్నారు. కడపలో ఇలాంటి లైబ్రరీ ఏర్పాటు చేసిన శాస్త్రి కృషి ప్రశంసనీయమన్నారు. విదేశీ ఉద్యోగాల కోసం తెలుగు భాషను మరచిపోతున్నారన్నారు. మాతృభాషను పరిపూర్ణంగా అర్ధం చేసుకుంటే ఏ భాషపై అయినా పట్టు సాధించవచ్చని అన్నారు. ఇతర దేశాల్లో వారు మాతృభాషకు ప్రాధాన్యత ఇస్తున్నారని తెలిపారు. ఇతర రాష్ట్రాల్లో, దేశాలలో వారు తమ భాషలో తప్ప ఇతర భాషలో సమాధానం చెప్పరన్నారు. 

తాను వీధి బడిలో చదువుకుని ఈ స్థాయికి వచ్చానని పేర్కొన్నారు. గొప్ప వారు కావాలంటే ఇంగ్లిష్ ఒక్కటే ప్రామాణికం కాదన్నారు. దేశంలో గొప్ప వారు తెలుగు బడిలో చదువుకుని పైకి వచ్చినవారేనని గుర్తు చేశారు. పక్క రాష్ట్రాలలో వారు తమ భాష కోసం ఎంత కృషి చేస్తున్నారో వారిని చూసి నేర్చుకోవాలన్నారు. మన తెలుగు భాషను మనమే పరిరక్షించుకోవాలన్నారు. రాష్ట్రంలో తెలుగు యూనివర్శిటీ ఏర్పాటు చేసి దానిని అభివృద్ధి చేయాలని సూచించారు. మన దేశంలో ఉన్న తెలుగు ప్రజల కన్నా విదేశాలలో ఉన్న తెలుగు ప్రజలు సంస్కృతి సంప్రదాయాలు పాటిస్తున్నారని తెలిపారు. 

రెండు రాష్ట్రాలలో తెలుగు భాషను రెండో భాషగా కోరవలసి వస్తుందన్నారు. ఉద్యోగ అవకాశాలకు, భాషకు సంబంధం లేదన్నారు. ఇటీవల కాలంలో ఓ ప్రభుత్వం తెలుగు భాషను తీసివేసి ఆంగ్ల భాషను విద్యా భాషగా చేయాలని ప్రయత్నం చేసిందని గత ప్రభుత్వాన్ని ఉద్దేశించి పరోక్షంగా వ్యాఖ్యానించారు. రాష్ట్రంలో పాత విద్యా విధానాన్ని కొనసాగించాలని ఇప్పటి ముఖ్యమంత్రి, విద్యాశాఖ మంత్రిని కోరినట్లు చెప్పారు. ప్రభుత్వాలు విద్యా విధానాలలో పలు మార్పులు తీసుకొస్తున్నాయని అన్నారు. ఇంగ్లిష్ నేర్చుకుంటేనే ఉద్యోగాలు వస్తాయని అనుకోవడం పొరపాటు అని అన్నారు.     
telugu language
justice nv ramana
Kadapa

More Telugu News