: చిరు, పవన్ కాంబినేషన్‌లో సినిమాకి, రాజకీయాలకు సంబంధం లేదు: సుబ్బరామిరెడ్డి
సినీనటులు, సోదరులు అయిన చిరంజీవి, పవన్ కల్యాణ్‌లను ప్రేక్షకులు ఎంతగానో ఆదరిస్తున్నారని ఎంపీ, నిర్మాత సుబ్బరామిరెడ్డి అన్నారు. తాను గతంలో చిరంజీవితో పలు సినిమాలు తీశానని చెప్పారు. గతంలో తాను రజనీకాంత్, శోభన్ బాబులతో కూడా మల్టీ స్టారర్ సినిమాను తీశానని గుర్తు చేసుకున్నారు. మెగాస్టార్ చిరంజీవి, పవర్ స్టార్ పవన్ కల్యాణ్‌ల కాంబినేషన్‌లో తాను సినిమా నిర్మిస్తానని సుబ్బరామిరెడ్డి ప్రకటించిన సంగతి తెలిసిందే. ఇదే అంశంపై ఈ రోజు ఆయన మరోసారి స్పందించారు. పవన్ కల్యాణ‌్ కి తన అన్నయ్యంటే ఎంతో ప్రేమ అని, అలాగే చిరుకి కూడా పవన్ అంటే ఎంతో ప్రేమ అని వ్యాఖ్యానించారు.
చిరు, పవన్‌లు ఇప్పటికే పలు సినిమాలు ఒప్పుకున్నారని, ఇక వారిద్దరి కాంబినేషన్‌లో సినిమా తీయడానికి సమయం ఎక్కడుందని కొందరు అంటున్నారని, అయితే తాను కచ్చితంగా వారితో సినిమా తీస్తానని చెప్పారు. తాను గతంలోనూ మల్టీ స్టారర్ సినిమాలను తీశానని, ప్రేక్షకులకు ఇటువంటి సినిమాలంటే ఎంతో ఆసక్తి ఉంటుందని అన్నారు. చిరు, పవన్‌లు తనకు మంచి స్నేహితులేనని అన్నారు. పవన్, చిరు, త్రివిక్రమ్ ముగ్గురూ ఎల్లప్పుడూ బిజీగానే ఉంటారని, అయినప్పటికీ తాను సినిమా తీస్తానని చెబితే ఒప్పుకున్నారని అన్నారు. అయితే, ఈ సినిమా కథ ఎలా ఉంటుందని విలేకరులు ప్రశ్నించగా.. వృక్షం రావాలంటే విత్తనం వేయాలని, ఆ విత్తనం తాను వేశానని అన్నారు. కథగురించి ఎటువంటి క్లూ ఇవ్వలేదు. చిరు, పవన్ కాంబినేషన్‌లో సినిమాకి, రాజకీయాలకు సంబంధం లేదని అన్నారు.