: 12 కిలో మీటర్ల ఎత్తులో విమానం.. అత్యవసర ద్వారం తీసే ప్రయత్నం చేసి అలజడి రేపిన ప్రయాణికుడు
ప్రముఖ ఎయిర్ లైన్సు సంస్థ ఆస్ట్రేలియన్ క్వాంటాస్‌కు చెందిన ఎయిర్ బస్ ఏ380 విమానంలో ఓ ప్రయాణికుడు అత్యుత్సాహానికి వెళ్లి, మిగతా ప్రయాణికులందరినీ భయభ్రాంతులకు గురిచేశాడు. లాస్ ఎంజెల్స్ నుంచి సిడ్నీ బయలుదేరిన ఆ విమానం భూమి నుంచి 39 వేల అడుగుల (12 కిలో మీటర్లు) ఎత్తులో ఉండగా సదరు ప్రయాణికుడు అత్యవసర ద్వారంను తెరవడానికి విశ్వ ప్రయత్నాలు చేశాడు. దానిని గమనించిన సిబ్బంది వెంటనే అప్రమత్తమై అతనిని పట్టుకొని సీట్లో కూర్చోబెట్టారు. విమానం తిరిగి ల్యాండ్ అయేవరకు అతడి వద్దే నిలబడి మళ్లీ అతడు అటువంటి చర్యకు పాల్పడకుండా చూసుకున్నారు.
సదరు ప్రయాణికుడు అమెరికాకు చెందిన మనుల్ గోంజాలెజ్ అని సంబంధిత అధికారులు తెలిపారు. అతడు డోర్‌ను ఎందుకు తెరవాలనుకున్నాడో ఇంతవరకు తెలియరాలేదు. అయితే, అంత ఎత్తులో ప్రయాణిస్తున్నప్పుడు విమానం అత్యవసర ద్వారం తెరవడం సాధ్యం కాదని అధికారులు తెలిపారు. ఆ ద్వారానికి ఎలక్ట్రికల్, మెకానికల్ ఉపకరణాలు అడ్డుగా ఉంటాయని చెప్పారు. విమానం ఆకాశంలో ఉన్నప్పుడు ఆ ద్వారాలను తెరవడం సాధ్యం కాదని వారు వ్యాఖ్యానించారు. ఈ విషయాలన్నీ తెలియకుండానే సదరు ప్రయాణికుడు ఈ ప్రయత్నం చేశాడని చెప్పారు. అతడిని అదుపులోకి తీసుకొని కేసు నమోదు చేసి, కోర్టులో ప్రవేశ పెట్టామని, ఆయన దోషిగా తేలితే సుమారు 10 ఏళ్ల వరకు శిక్ష పడుతుందని వారు పేర్కొన్నారు.