: ఉచిత వైఫై దొరికింది కదా అని ఈ పనులు మాత్రం చేయకండి.. హెచ్చరిస్తున్న నిపుణులు
ఇప్పుడు వైఫై లేని ప్రదేశం లేదు. కొన్ని వ్యాపార సంస్థలైతే వినియోగదారులను ఆకర్షించేందుకు ఉచిత వైఫైని అందుబాటులో ఉంచుతున్నాయి. ఇప్పుడిదో వ్యాపార సూత్రం అయిపోయింది. అయితే ఉచితంగా దొరికింది కదా అని ఆన్‌లైన్ ట్రాన్సాక్షన్స్ చేస్తే మొదటికే మోసం వస్తుందని సైబర్ నిపుణులు హెచ్చరిస్తున్నారు. సోమవారం రాచకొండ కమిషనరేట్ పరిధిలో క్షేత్రస్థాయి సిబ్బందికి నగదు రహిత లావాదేవీలు-సైబర్ భద్రతపై అవగాహన సదస్సు నిర్వహించారు. సైబర్ నేరగాళ్లు చేసే మోసాలను సదస్సులో నిపుణులు వివరించారు. ఖాతాల్లోని నగదు అకస్మాత్తుగా మాయమైతే తీసుకోవాల్సిన చర్యలపై అవగాహన కల్పించారు. నిపుణులు ఏం చెప్పారో యథాతథంగా..
కొందరికి మూడునాలుగు బ్యాంక్ అకౌంట్లు ఉంటాయి. అన్ని ఖాతాలకు ఆన్‌లైన్ బ్యాంకింగ్ సహా క్రెడిట్, డెబిట్ కార్డులను ఉపయోగిస్తుంటారు. సరిగ్గా ఇదే సైబర్ మోసగాళ్లకు అనువుగా మారుతుంది. సాధారణంగా చాలామంది ఖాతాదారులు తమ పాస్‌వర్డ్‌లను సులభంగా గుర్తుపెట్టుకునేలా క్రియేట్ చేసుకుంటారు. అంటే నిక్‌నేమ్, ఇంటిపేరు, మొబైల్ నంబరులోని మొదటి, చివరి నంబరు, పుట్టిన తేదీలు, బైక్ నంబరు.. ఇలా సులభంగా ఉన్నవి పెట్టుకుంటారు. ఇలా చేయడం వల్ల హ్యాకర్లకు ఈజీగా దొరికిపోతారు. కాబట్టి పాస్‌వర్డ్ ఎప్పుడు నంబర్లు, లెటర్లతో కలగాపులగంగా ఉండాలి. ఏటీఎం పిన్ నంబరును ఎవరికీ చెప్పకూడదు. బ్యాంకు ఖాతాల విషయంలో గోప్యత అవసరం. ఇంటర్‌నెట్ కేఫ్, ఇతరుల కంప్యూటర్ల ద్వారా ఆన్‌లైన్ బ్యాంకింగ్ చేయడం ప్రమాదకరం. మరీ ముఖ్యంగా ఉచిత వైఫ్‌తో చేయడం అత్యంత ప్రమాదకరం.
ఆన్‌లైన్ ట్రాన్సాక్షన్స్ జరిపే కంప్యూటర్‌లో తప్పకుండా అప్‌డేటెడ్ సాఫ్ట్‌వేర్ ఉండాలన్ని విషయాన్ని ప్రతి ఒక్కరు గుర్తుపెట్టుకోవాలి. అలాగే యాంటీ వైరస్, యాంటీమాల్‌వేర్ సాఫ్ట్‌వేర్లు కూడా ఉండాల్సిందే. అంతేకాదు ఇవి ఎప్పటికప్పుడు అప్‌డేట్ అవుతుండాలి. మార్కెట్లో అందుబాటులో ఉన్న పలు రకాల ఓఎస్‌లు, యాంటీవైరస్, మాల్‌వేర్‌లను ఇన్‌స్టాల్ చేసుకోవడం ద్వారా సైబర్ నేరగాళ్లకు చెక్‌పెట్టొచ్చు. భారత్‌లో అభివృద్ధి చేసిన భారత ఆపరేటింగ్ సిస్టమ్స్ సర్వీసెస్(బాస్) అయితే భద్రత పరంగా ఎంతో మంచిది. సైబర్ నేరాలకు సంబంధించిన సందేహాలను www.infosecawarness.in వెబ్‌సైట్ ద్వారా కానీ, isea@cdac.in అనే ఈ మెయిల్ ద్వారా కానీ నివృత్తి చేసుకోవచ్చు. ఫిర్యాదు చేయవచ్చు. అలాగే రాచకొండ వాట్సప్ నెంబర్: 9490617111, రాచకొండ ఫేస్‌బుక్, ట్విట్టర్ ఐడీ:Rachakonda Police
రాచకొండ సైబర్ క్రైం పోలీస్ స్టేషన్ ఎస్‌హెచ్‌వో: 9490 617437 నంబర్లలో ఫిర్యాదు చేయవచ్చు.