: కొరడా ఝళిపించిన సుప్రీంకోర్టు... బీసీసీఐ అధ్యక్షుడిగా అనురాగ్ ఠాకూర్ తొలగింపు
దేశ సర్వోన్నత న్యాయస్థానం సుప్రీకోర్టు అనుకున్నంత పనీ చేసింది. తమ ఆదేశాలను పాటించకుండా, మొండి వైఖరితో ముందుకెళుతున్న బీసీసీఐ అధ్యక్షుడు అనురాగ్ ఠాకూర్ ను ఆ పదవి నుంచి తొలగించింది. ఆయనతో పాటు బీసీసీఐ సెక్రటరీ అజయ్ షిర్కేపై కూడా వేటు వేసింది. వీరిద్దరూ ఈ పదవుల్లో కొనసాగడానికి అర్హులు కాదంటూ తీవ్ర వ్యాఖ్యలు చేసింది.
లోథా కమిటీ సిఫారసులను అమలు చేయాలని తాను ఆదేశించినప్పటికీ... బీసీసీఐ పట్టించుకోకపోవడంతో, సుప్రీంకోర్టు కొరడా ఝళిపించింది. అనురాగ్ ఠాకూర్ కు కోర్టు ధిక్కార నోటీసులను జారీ చేసింది. లోథా కమిటీ సిఫారసులను అమలు చేయాల్సిందేనని మరోసారి చెప్పింది. తన ఆదేశాలను పాటించకపోతే చూస్తూ ఊరుకోనని తీవ్ర హెచ్చరికలు పంపింది. త్వరలోనే ఈ పదవులను కొత్తవారితో సుప్రీంకోర్టు భర్తీ చేయనుంది. సుప్రీం తీర్పుతో బీసీసీఐలోని కీలక వ్యక్తులు మరికొందరు తమ పదవులు కోల్పోయే అవకాశం ఉందని నిపుణులు అభిప్రాయపడుతున్నారు. మరోవైపు, తొలగించిన వారి స్థానంలో ఇతరులను నియమించేందుకు, లోథా కమిటీ సిఫారసులను అమలు చేయడానికి సుప్రీంకోర్టు ఓ పానెల్ ను ఏర్పాటు చేసింది.