: బాయ్ ఫ్రెండ్ కోసం దొంగతనాల బాట పట్టిన హైదరాబాద్ యువతి
తన బాయ్ ఫ్రెండ్ ఆర్థిక కష్టాల్లో ఉన్నాడని తెలుసుకున్న ఓ 19 ఏళ్ల అమ్మాయి దొంగతనాల బాట పట్టింది. ఈ కేసు వివరాలు పోలీసులనే ఆశ్చర్యపోయేలా చేశాయి. మరిన్ని వివరాల్లోకి వెళితే, మలక్ పేటలో ఉంటున్న జి.సాయి కిరణ్మయి అనే యువతి, జిమ్ ఇనస్ట్రక్టర్ గా ఉన్న యశ్వంత్ నాయుడు అనే యువకుడిని ప్రేమించింది. అతనికి డబ్బులు అవసరమని తెలుసుకుని, మాస్టర్ ప్లాన్ వేసింది.
ఫేస్ బుక్ లో తన పేరిట ఖాతాను తెరిచి, పలువురు మహిళలతో స్నేహం కుదుర్చుకుంది. వాళ్లింటికి వెళ్తూ, వస్తూ మంచి స్నేహితురాలిగా ఉండేది. వాళ్లతో కలివిడిగా తిరుగుతూ, అవకాశం దొరికినప్పుడల్లా వాళ్లింట్లోని బంగారు ఆభరణాలు, నగదు దొంగతనం చేస్తుండేది. గత నెలలో తన ఫ్రెండ్ ఇంటికి వెళ్లిన ఆమె, 15 తులాల బంగారు ఆభరణాలు దొంగిలించింది. బాధితుల ఫిర్యాదు మేరకు, కిరణ్మయిని అరెస్ట్ చేసి ప్రశ్నిస్తే, అసలు విషయం వెల్లడైంది. ఆమెతో పాటు యశ్వంత్ నూ అరెస్ట్ చేశామని, కోర్టు ఇద్దరినీ జ్యుడీషియల్ కస్టడీకి పంపిందని పోలీసులు తెలిపారు.