కుక్క బిర్యాని అమ్ముతున్నారంటూ వాట్సప్ ద్వారా వదంతులు వ్యాప్తి చేసిన హైదరాబాదు యువకుడి అరెస్ట్
ఈ పుకార్లు రావడానికి చంద్రమోహన్ అనే యువకుడు కారణమని విచారణలో తేలడంతో అతనిని అరెస్టు చేశారు. కుక్క మాంసంతో బిర్యాని తయారు చేస్తున్నారని ఈ యువకుడే ఫేక్ న్యూస్ ను సృష్టించి తన వాట్సాప్ ద్వారా తన స్నేహితులకి పంపించాడని పోలీసులు తెలిపారు. రెస్టారెంట్ కు వెళ్తున్న తన స్నేహితులను భయపెట్టేందుకు ఎంబీఏ విద్యార్థి అయిన చంద్రమోహన్ ఈ పుకారును తన స్నేహితులకి పంపించాడని పోలీసులు తెలిపారు.
అందుకోసం తల నరికిన కుక్కల ఫొటోలను సృష్టించి, రాయదుర్గంలోని షా గౌస్ హోటల్ యజమానిని పోలీసులు అరెస్టు చేశారని పేర్కొంటూ ఫేక్ న్యూస్ ను పంపించాడు. దీంతో చంద్రమోహన్ స్నేహితులు తమకు వచ్చిన వివరాలను వేరే వాట్సాప్ గ్రూప్ లకు పంపించారు. ఇలా ఆ న్యూస్ వాట్సప్ లో చక్కర్లు కొట్టింది. వాట్సప్ గ్రూప్ లను పరిశీలించుకుంటూ వెళ్లగా ఆ న్యూస్‌ను చంద్రమోహన్ సృష్టించాడని తమకు తెలిసిందని పోలీసులు తెలిపారు. ఇదే ఫేక్ న్యూస్‌ను నమ్మిన న్యూస్ చానెళ్లు నిజానిజాలు తెలుసుకోకుండా ప్రసారం చేశాయి.