: తమిళనాడుకు శశికళ ముఖ్యమంత్రి అయితే తప్పేముంది?: విజయశాంతి
తమిళనాడు దివంగత ముఖ్యమంత్రి జయలలితకు సన్నిహితుల్లో తెలుగు సినీనటి, లేడీ అమితాబ్‌గా పేరుపొందిన విజయశాంతి కూడా ఒకరు. తాజాగా ఆమె మీడియాకు ఇచ్చిన ఇంటర్వ్యూలో పలు అంశాల గురించి మాట్లాడారు. 1998 నుంచి తనకు జయలలితతో పరిచయం ఉందని అన్నారు. ఎంతో మంది సమస్యలను జయలలిత పరిష్కరించారని ఆమె చెప్పారు. ఆమెను మళ్లీ చూడలేమన్న విషయాన్ని తాను జీర్ణించుకోలేకపోతున్నానని అన్నారు. సినిమా పరంగా కాకుండా రాజకీయపరంగానే జయలలితతో తనకు పరిచయం ఉందని అన్నారు.
జయలలిత స్థానాన్ని భర్తీ చేయడానికి శశికళే సరైన నాయకురాలని తాను అనుకుంటున్నట్లు విజయశాంతి అభిప్రాయపడ్డారు. శశికళతో ప్రాబ్లం ఏమీ లేదని, జయలలిత తనతో గతంలో కొన్నిసార్లు చెప్పారని అన్నారు. ఇప్పుడున్న పరిస్థితులకి శశికళకే అన్నాడీఎంకే పగ్గాలు అప్పజెప్పి ముందుకెళితే బెటరని తాను అనుకుంటున్నట్లు పేర్కొన్నారు. ఆమె అధినేత్రి అవుతానంటే అన్నాడీఎంకే పార్టీలో ఏ సమస్యాలేదని ఆమె అన్నారు.
చిన్నమ్మ శశికళే మాకు కాబోయే సీఎం అని పలువురు చేస్తోన్న వ్యాఖ్యలపై ఆమె స్పందిస్తూ, శశికళ సీఎం అయితే తప్పేముందని ప్రశ్నించారు. పార్టీలో అందరూ ఒప్పుకునే మనిషి కాబట్టి, శశికళ ముఖ్యమంత్రి అయితే పార్టీలోనూ ఏ విభేదాలు రాకుండా ఉంటాయని తాను అనుకుంటున్నట్లు చెప్పారు.