: ఏడాదిలో 797 ఉగ్రదాడులు... ప్రపంచంలో టాప్-7 ర్యాంకు ఇండియాదే!
ఉగ్రవాదంతో నష్టపోతున్న దేశాల జాబితాను విడుదల చేయగా, భారత్ 7వ స్థానంలో నిలిచింది. ఆస్ట్రేలియాలోని సిడ్నీ కేంద్రంగా పనిచేస్తున్న ఇనిస్టిట్యూట్ ఫర్ ఎకనామిక్స్ అండ్ పీస్ సంస్థ గ్లోబల్ టెర్రరిజం ఇండెక్స్ (జీటీఐ) 2016 విడుదల చేయగా, టాప్ 10లో ఆరు ఆసియా దేశాలు స్థానం సంపాదించడం గమనార్హం. మొత్తం 797 మార్లు ఉగ్రదాడులు ఇండియాలో జరిగాయని, 2015లో ఉగ్రదాడుల కారణంగా 289 మంది మరణించారని జీటీఐ పేర్కొంది. 2014తో పోలిస్తే ఉగ్ర మరణాలు 45 శాతం తగ్గినప్పటికీ, ఈ స్థాయి మరణాలు ప్రమాదకరమేనని పేర్కొంది. 2000 తరువాత, 2015లో అత్యధిక దాడులు జరిగాయని, 20 శాతం దాడుల్లో అత్యంత ప్రమాదకర ఆయుధాలను ఉగ్రవాదులు వాడారని తెలిపింది. ప్రపంచం మొత్తం మీద జరిగిన ఉగ్రదాడులను పరిశీలిస్తే, ఇరాక్ లో 20 శాతంగా 2,415 దాడులు, ఆఫ్గనిస్తాన్ లో 14 శాతంగా 1,715 దాడులు పాకిస్థాన్ లో 8 శాతంగా 1,008 దాడులు జరిగాయి. ఇక సిరియాలో జరిగిన దాడులతో (384) పోలిస్తే ఇండియాలో రెట్టింపు దాడులు జరగడం గమనార్హం. ఇక గడచిన 16 సంవత్సరాల్లో ఉగ్రవాదం కారణంగా గ్లోబల్ ఎకానమీ 635 బిలియన్ డాలర్లు (సుమారు రూ. 43.18 లక్షల కోట్లు) నష్టపోయిందని జీటీఐ వెల్లడించింది.