: అమెరికాలో ఘోర అగ్నిప్రమాదం.. 12 మంది సజీవ దహనం.. మృతుల సంఖ్య మరింత పెరిగే అవకాశం
అమెరికాలో భారీ అగ్నిప్రమాదం సంభవించింది. కాలిఫోర్నియాలోని ఓక్లాండ్‌లో మూతపడిన ఓ గోడౌన్‌లో విందు చేసుకుంటుండగా అకస్మాత్తుగా మంటలు ఎగసిపడి మొత్తం వ్యాపించాయి. మంటల్లో చిక్కుకున్న పలువురు మృత్యువాత పడ్డారు. 12 మంది వరకు మృతి చెందారని, మృతుల సంఖ్య మరింత పెరిగే అవకాశం ఉందని పోలీసులు చెబుతున్నారు. ప్రమాద సమయంలో గోదాములో 100 మంది వరకు ఉన్నారని తెలిపారు. 40 మంది ఆచూకీ ఇప్పటి వరకు తెలియరాలేదని పేర్కొన్నారు. క్షతగాత్రులను ఆస్పత్రికి తరలించినట్టు తెలిపారు. కొన్ని రోజుల క్రితమే ఈ గోదామును పోలీసులు తనిఖీ చేసినట్టు తెలుస్తోంది. ఫైర్ సేఫ్టీ విధానాలను గోదాము యజమానులు పాటించలేదని అధికారులు చెబుతున్నారు. యజమాని సహా మరికొందరిని అదుపులోకి తీసుకుని విచారిస్తున్నారు. సహాయక చర్యలు కొనసాగుతున్నాయి.