: 89 ఏళ్ల ఆ తాతగారికి ఉద్యోగం వచ్చేసిందోచ్!
'అబ్బ.. ఈ జాబ్ చేయలేకపోతున్నా.. ఎప్పుడు రిటైరవుతాన్రా బాబూ..' అంటూ విశ్రాంతి కోరుకునే ఎందరికో 89 ఏళ్ల జోయ్ బార్ట్ లే స్పూర్తిమంతంగా నిలుస్తున్నారు. ఇంగ్లాండ్ లోని పెయింటన్ కి చెందిన జోయ్ బార్ట్ లే (89) 1940లో ఆర్మీలో చేరి సేవలందించారు. అనంతరం పెయింటర్ గా పని చేశారు. వయసు పైబడడంతో రిటైర్మెంట్ ఇచ్చారు. దీంతో ఆయన ఖాళీ అయిపోయారు. అయితే, అదే ఆయనకు నచ్చలేదు. ఎంత సేపు ఇలా ఖాళీగా కూర్చోవడం? అని భావించిన ఆయన ఏదో ఒక ఉద్యోగం చేయాలని భావించారు. దీంతో తెలిసిన వారిని అడిగారు. వాళ్లు 'చేసింది చాలు, ఇంక విశ్రాంతి తీసుకోండి తాతగారూ' అంటూ సలహాలు ఇచ్చారు గానీ, ఉద్యోగం చూపించిన పాపాన పోలేదు. దీంతో తానే పని వెతుక్కోవాలని భావించి, 'వర్క్ వాంటెడ్' అంటూ ఏకంగా ఓ ప్రకటన ఇచ్చేశారు. ‘89 ఏళ్ల సీనియర్ సిటిజెన్ కు పెయింటన్ ప్రాంతంలో పని కావలెను. క్లీనింగ్, గార్డెనింగ్, ఇలా.. ఏ పనైనా ఫర్వాలేదు. వారానికి 20 గంటలకు పైగా పని చేసే సామర్థ్యం నా సొంతం... నాకు విశ్రాంత సైనికులు, వైమానిక ఉద్యోగుల రిఫరెన్స్ కూడా ఉంది. ఖాళీగా ఉండలేకపోతున్నాను. ఎవరైనా ఉద్యోగం కల్పించి ఆడుకోండి’ అంటూ ఆయన స్థానిక పత్రికలో ప్రకటన ఇచ్చారు. ఆయన ప్రకటన పెయింటన్ లో ఉన్న అందర్నీ ఆకర్షించింది. దీంతో ఆయనకు పని కల్పించేందుకు చాలా కంపెనీలు ముందుకు వచ్చాయి. ఇప్పుడాయన ముందు చాలా ఆఫర్లున్నాయి. ఆయన వాటిల్లో ఏదో ఒకదానిని ఎంచుకుంటే సరిపోతుంది. మంచి నిర్ణయం తీసుకొని త్వరలోనే ఉద్యోగంలో చేరుతానని ఆయన తెలిపారు.