: కేంద్రం తీసుకున్న నిర్ణయం కారణంగా 1500 కోట్లు నష్టం: తెలంగాణ మంత్రి ఈటల
కేంద్ర ప్రభుత్వం తీసుకున్న పెద్దనోట్ల రద్దు నిర్ణయం కారణంగా తెలంగాణ రాష్ట్ర రెవెన్యూ విభాగానికి తీరని నష్టం వాటిల్లిందని ఆర్థిక మంత్రి ఈటల రాజేందర్ తెలిపారు. హైదరాబాదులో ఆయన మాట్లాడుతూ, ఈ నిర్ణయం కారణంగా తెలంగాణ రెవెన్యూ విభాగానికి వెయ్యి నుంచి 1500 కోట్ల రూపాయల వరకు నష్టం వాటిల్లుతుందని అన్నారు. తక్కువ కరెన్సీ నోట్లు వచ్చినప్పటికీ ఈ కష్టాలు మరో మూడు నుంచి ఆరు నెలలపాటు కొనసాగే అవకాశం ఉందని ఆయన అభిప్రాయపడ్డారు. స్టాంపులు, రిజిస్ట్రేషన్లు, మోటారు వెహికల్, కమర్షియల్ టాక్స్ రంగాల్లో దీని ప్రభావం అధికంగా ఉంటుందని ఆయన పేర్కొన్నారు. ఆదాయం తగ్గిపోతున్న నేపథ్యంలో కేంద్రానికి చెల్లించాల్సిన రుణాలను కొంత కాలంపాటు వాయిదా వేయాలని సీఎం కేసీఆర్, ప్రధాని మోదీని కోరారని ఆయన తెలిపారు. ప్రధాని ఉద్దేశం మంచిదైనా అమలులో సంస్కరణలు తేవాల్సిన అవసరం ఉందని ఆయన తెలిపారు.