: భద్రత ఏది? లోక్ సభలోకి ఆగంతుకుని చొరబాటు... గ్యాలరీ నుంచి సభలోకి దూకేయత్నం
దేశంలో మరెక్కడా లేని విధంగా అత్యంత కట్టుదిట్టమైన భద్రత ఉండే పార్లమెంట్ ఆవరణలోకి భద్రతా దళాల కన్నుగప్పి ఓ ఆగంతుకుడు వచ్చాడు. ఆపై లోక్ సభలోకి ప్రవేశించాడు. గ్యాలరీలోకి వెళ్లి కూర్చుని ఆపై దర్జాగా సభలోకి దూకేందుకు ప్రయత్నించాడు. భద్రతా దళాలు, నిఘా వర్గాల వైఫల్యం, కొట్టొచ్చినట్టు కనిపిస్తున్న ఈ ఘటన దేశ పార్లమెంట్ భద్రతపై కొత్త సందేహాలను ముందుకు తెచ్చింది. గ్యాలరీ నుంచి సభలోకి దూకబోయిన సమయంలో ఆగంతుకుని గుర్తించిన పోలీసులు అతన్ని అదుపులోకి తీసుకున్నారు. ఈ వ్యక్తి ఎవరన్న విషయాన్ని ప్రస్తుతం విచారిస్తున్నారు. ఈ వ్యక్తి ఓ విజిటింగ్ పాస్ తో లోపలికి ప్రవేశించాడని తెలుస్తోంది. సాధారణ ప్రజల గ్యాలరీలోకి వచ్చి, అక్కడి నుంచి సభలోకి దుమికేందుకు యత్నించగా, అరెస్ట్ చేసినట్టు పోలీసు వర్గాలు ధ్రువీకరించాయి. సభ వాయిదా పడ్డ తరువాత లోనికి దుమికేందుకు ప్రయత్నించాడని, అతని ఉద్దేశం ఏంటన్న విషయమై విచారణ జరుపుతున్నామని ఓ అధికారి వివరించారు. ఈ విషయమై మరిన్ని వివరాలు తెలియాల్సి వుంది.