: పెద్దనోట్ల రద్దు ప్రభావం: మార్కెట్‌లో కిలో టమోటో మూడు రూపాయలే
పెద్దనోట్లను రద్దు చేస్తూ కేంద్ర ప్రభుత్వం తీసుకున్న నిర్ణయంతో ఆ ప్రభావం అన్ని రంగాల మీద పడుతోంది. లావాదేవీలు లేక మార్కెట్లు వెలవెలబోతున్నాయి. పెద్దనోట్ల రద్దు నిర్ణయం ప్రకటించి పదిరోజులు దాటినా ప్రజల అవసరాలకు తగినంత చిల్లర దొరకకపోవడంతో మార్కెట్లకు వెళ్లి కొనుగోలు చేసే వినియోగదారుల సంఖ్య గణనీయంగా పడిపోయింది. చిల్లర లేకపోవడంతో వ్యాపారులు, రైతులు, రైతుబజార్లలో చిరు వ్యాపారులు బేరాలను వదులుకుంటున్నారు. వీటి ప్రభావం రైతులపై తీవ్రంగా పడుతోంది. మార్కెట్‌లో కిలో టమోటో మూడు రూపాయలకు పడిపోయింది. హైదరాబాద్‌లోని కొన్ని రైతు బజార్లలో గిరాకీ లేకపోవడంతో కొన్ని రోజులుగా ఉన్న కూరగాయలు కుళ్లిపోవడంతో వాటిని చెత్తకుండీల్లో పారేస్తున్నారు. ధరల పతనంతో రైతులు విలవిలలాడుతున్నారు. గిట్టుబాటు ధరలేక ఆందోళన చెందుతున్నారు.