: ప్రకాశం జిల్లాలో దారుణం.. దంపతులపై కత్తితో దాడి చేసి పారిపోయిన హోంగార్డు
ఓ హోంగార్డు దంపతులపై కత్తితో దాడి చేసిన ఘటన ప్రకాశం జిల్లా వేటపాలెంలో కలకలం రేపింది. ఆ ప్రాంతంలోని అనుమల్లిపేటకు చెందిన వెంకటేశ్వరరావు, అతని భార్య రామలక్ష్మిపై హోంగార్డుగా పనిచేస్తోన్న వసంతరావు అనే వ్యక్తి ఈ దాడి చేశాడు. చిట్టీలు కూడా నిర్వహించే వసంతరావు తనకు బకాయిలు పడిన కారణంగా వెంకటేశ్వరరావుపై దాడికి దిగాడు. అతడిని అడ్డుకోబోయిన వెంకటేశ్వరావు భార్యను కూడా కత్తితో పొడిచి, అనంతరం అక్కడి నుంచి పారిపోయాడు. దీనిని గమనించిన స్థానికులు తీవ్రగాయాలతో బాధపడుతున్న దంపతులను ఆసుపత్రికి తరలించారు. వెంకటేశ్వరరావు పరిస్థితి విషమంగా ఉందని డాక్టర్లు చెప్పారు. సమాచారం అందుకున్న పోలీసులు ఈ ఘటనపై కేసు నమోదు చేసుకొని దర్యాప్తు ప్రారంభించారు.