: డెబిట్ కార్డు చెల్లింపులకు 'నో' అంటున్న నిమ్స్.. పేషెంట్లకు నరకయాతన... బంధువుల ఆందోళన
హైదరాబాదులోని నిమ్స్ ఆసుపత్రి యాజమాన్యం పేషెంట్లకు నరకం చూపిస్తోంది. బిల్లులను నగదు రూపంలో లేదా క్రెడిట్ కార్డుల ద్వారా మాత్రమే చెల్లించాలని షరతు విధించింది. డెబిట్ కార్డుల ద్వారా చెల్లిస్తామని పేషెంట్ల తరపు బంధువులు చెబుతున్నా నిమ్స్ సిబ్బంది ఒప్పుకోవడం లేదు. డెబిట్ కార్డులను స్వైప్ చేసే మిషన్ తమ వద్ద లేదని వారు చెబుతున్నారు. మరోవైపు, బిల్లులు చెల్లించకపోతే పేషెంట్లను డిశ్చార్జ్ చేయబోమని డాక్టర్లు స్పష్టం చేశారు. దీంతో, పేషెంట్ల బంధువులు ఆందోళన చెందుతున్నారు. బ్యాంకుల వద్ద భారీ క్యూలైన్లు ఉన్నాయని, తమ వద్ద క్రెడిట్ కార్డులు లేవని, ఇలాంటి పరిస్థితుల్లో ఏం చేయాలని ఆసుపత్రి సిబ్బందిపై వారు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. తాము డబ్బులు చెల్లించడానికి ఉన్న ఏకైక మార్గం డెబిట్ కార్డే అని వాపోతున్నారు.