: పాక్ నుంచి 8 మంది దౌత్యాధికారులను వెనక్కి రప్పిస్తున్న భారత్
పాకిస్థాన్ లో భారత రాయబార కార్యాలయంలో పనిచేస్తున్న ఎనిమిది మందిని వెనక్కు రప్పించాలని భారత ప్రభుత్వం నిర్ణయించింది. ఇటీవలి కాలంలో వీరి గురించి వార్తలు ప్రచురితం కావడం, వారి గుర్తింపు బయటకు వెల్లడైన తరువాత ప్రాణహాని వుంటుందన్న ఆలోచనతో భారత్ ఈ నిర్ణయం తీసుకుంది. వీరి ఫోటోలు, వారి విధులు తదితరాలను పాక్ మీడియా వెల్లడించడంతో, వారిని రప్పించేందుకు ఉత్తర్వులు జారీ చేయనున్నట్టు ఓ అధికారి తెలిపారు. గత వారంలో మెహమూద్ అఖ్తర్ అనే పాక్ హై కమిషన్ అధికారిని గూఢచార ఆరోపణలపై అరెస్ట్ చేసి, ఆపై దేశ బహిష్కరణ శిక్ష విధించిన సంగతి తెలిసిందే. ఇండియాలో 16 మంది ఇతర ఉద్యోగులు దౌత్యపరమైన రక్షణలో ఉంటూ వివిధ రకాల రహస్యాలను పాక్ చేరవేస్తున్నట్టు విచారణలో భాగంగా అఖ్తర్ వెల్లడించగా, వారిని గుర్తించేందుకు అధికారులు శ్రమిస్తున్నారు. మెహమూద్ బహిష్కరణ తరువాత పాక్ సైతం ఓ భారత అధికారిని బహిష్కరించింది. ఈ క్రమంలోనే పాకిస్థాన్ లో ఉన్న భారత దౌత్యాధికార సిబ్బంది వివరాలన్నీ బయటకు వచ్చాయి.