: 20 గంటల తరువాత వీసీని వదిలిన జేఎన్యూ స్టూడెంట్స్
నిన్నటి నుంచి వైస్ చాన్స్ లర్ ను నిర్బంధించిన జవహర్ లాల్ నెహ్రూ యూనివర్శిటీ విద్యార్థులు కొద్దిసేపటి క్రితం ఆయనను బయటకు వెళ్లేందుకు అనుమతించారు. ఓ విద్యార్థి అదృశ్యంపై ఆగ్రహించిన ఇతర విద్యార్థులు వీసీ కార్యాలయాన్ని దిగ్బంధించారు. దాదాపు 20 గంటల పాటు వీసీ ఎం.జగదీశ్ కుమార్ ను గదిలో నుంచి కదలకుండా బంధించిన విద్యార్థులు, పలు దఫాల చర్చల అనంతరం ఈ మధ్యాహ్నం విడిచిపెట్టారు. కాగా, కనబడకుండా పోయిన విద్యార్థి నజీబ్ అహ్మద్ ఆచూకీ తెలిపితే రూ. 50 వేల రివార్డు ఇస్తామని పోలీసులు పేర్కొనగా, అతన్ని వెతికేందుకు కృషి చేస్తున్నామని, అతను తిరిగి వర్శిటీలోకి ప్రవేశిస్తాడని నమ్ముతున్నానని వీసీ వ్యాఖ్యానించారు. శుక్రవారం రాత్రి హాస్టల్ గదిలో ఓ గొడవ జరుగగా, అప్పటి నుంచి నజీబ్ కనిపించడం లేదు. అతన్ని ఏబీవీపీ కార్యకర్తలు కొట్టారన్నది ఆల్ ఇండియా స్టూడెంట్స్ అసోసియేషన్ ఆరోపణ.