: నలభైసార్లు గుండె చప్పుడు ఆగిపోయినా బతికిన తాత.. జానపద గేయాలు పాడి వైద్యులకు షాకిచ్చిన వృద్ధుడు!
ఒక్కసారి గుండె ఆగిపోయిందంటే వారికిక భూమిపై నూకలు చెల్లినట్లే భావిస్తాం. పూరి గుడిసెలో బతికే పేదవాడైనా, బంగారు కంచంలో ఆహారం తీసుకొనే శ్రీమంతుడైనా గుండె ఆగిందంటే ఇక అంతే! అలాంటిది నలభైసార్లు గుండె చప్పుడు ఆగిపోతే బతకడం సాధ్యమా? బతికి బయటపడి మళ్లీ మాట్లాడగలిగితే.. పాటలు పాడగలిగితే..? అటువంటి ఘటనే ఈశాన్య టర్కీకి చెందిన ఓ ఆసుపత్రిలో జరిగింది. మరణం అంచు వరకు వెళ్లి బతికి బయట పడడమే కాక, వైద్యుల ముందే జానపద గేయంపాడి షాకిచ్చాడు బెకిర్ డెమిర్టాస్ అనే 66 ఏళ్ల వృద్ధుడు. బెకిర్ డెమిర్టాస్ కొంతకాలంగా గుండె జబ్బుతో బాధపడుతున్నాడు. అతని గుండెలోని ధమనులు సరిగా పనిచేయక పోవడంతో గుండె నొప్పితో ఎర్జిచాన్‌లోని ‘మెంగుసెక్ పరిశోధన, శిక్షణ ఆసుపత్రి’లో చికిత్స కోసం తరలించారు. పరీక్షలు జరిపిన వైద్యులు అతడి మూడు ధమనుల్లో ఒకటి పాడైపోయిందని తేల్చారు. అధికశాతం రక్తం గడ్డకట్టిందని చెప్పి, ట్రిపుల్ బైపాస్ సర్జరీకి సన్నాహాలు చేసుకున్నారు. సుమారు నాలుగు గంటల పాటు శ్రమపడి సర్జరీ చేశారు. అనంతరం డెమిర్టాస్‌ను ఐసీయూలోకి మార్చారు. తదుపరి చికిత్సలు తీసుకుంటున్న అతని గుండె 40 సార్లు ఆగిపోయింది. దీంతో వైద్యులు వెంటనే హృదయంపై చేతులతో మసాజ్ చేశారు. అయినా గుండె కొట్టుకునే సూచనలు వైద్యులకు కనిపించలేదు. అయితే, ఒక్కసారిగా డెమిర్టాస్ చక్కని జానపద గేయాల్ని పాడాడు. ఇక ఆ డాక్టర్లు షాక్ అయ్యారు. వృద్ధుడు బతకడం పట్ల హర్షం వ్యక్తం చేశారు. తనకు జరిగిన ఆపరేషన్‌పై డెమిర్టాస్ మాట్లాడుతూ తనకు ట్రిపుల్ బైపాస్ సర్జరీ చేసిన సంఘటనలన్నీ తనకు జ్ఞాపకం ఉన్నట్లే ఉన్నాయని చెప్పాడు. ఆసుపత్రి వైద్యులు తనను ఎంతో కష్టపడి శ్రమించి కాపాడారని అన్నాడు. అందుకే వారికోసం తాను కోలుకోగానే వెంటనే జానపద పాటల్ని పాడినట్లు చెప్పాడు. డాక్టర్లకు తన కృతజ్ఞతలు తెలుపుతున్నట్లు పేర్కొన్నాడు. తనకు గుండెలో తీవ్రమైన నొప్పి కలిగిందని అన్నాడు. మృత్యువుపై పోరాడి గెలవాలనే బలమైన కోరికే తనను బతికించిందని చెప్పాడు.