: రెండు నెలల్లో భారీగా పెరగనున్న క్రూడాయిల్ ధర: సౌదీ అంచనా
డిసెంబర్ నాటికి క్రూడాయిల్ భారీగా పెరిగే అవకాశాలున్నాయని 'ఒపెక్'లోని అగ్రదేశం సౌదీ అరేబియా అంచనా వేసింది. పలు దేశాలు ముడి చమురు తయారీని తగ్గించనున్నాయని హెచ్చరిస్తూ, క్రూడాయిల్ ధర బ్యారల్ కు 60 డాలర్లకు చేరవచ్చని అంచనా వేసింది. ఇస్తాంబుల్ లో జరుగుతున్న వరల్డ్ ఎనర్జీ కాంగ్రెస్ లో పాల్గొన్న సౌదీ అరేబియా ఇంధన మంత్రి ఖలీద్ అల్ ఫలీహ్ ప్రసంగిస్తూ, చమురు సంస్కరణలను అమలు చేసేందుకు తమ దేశం సిద్ధంగా ఉందని తెలిపారు. ముడిచమురు ధర సంతృప్తకర స్థాయిలో కొనసాగాలన్నదే తమ అభిమతమని ఆయన అన్నారు. 2030 నాటికి తమ ఆర్థిక వ్యవస్థ క్రూడాయిల్ పై ఆధారపడబోదని ఆయన అన్నారు. మరో రెండు నెలల్లోనే ఇప్పుడున్న ధరతో పోలిస్తే 20 శాతం వరకూ క్రూడాయిల్ ధర పెరుగుతుందని అంచనా వేస్తున్నామని, అయితే, ఇది డిమాండ్, సప్లయ్ పై ఆధారపడి కొన్ని మార్పులకు లోబడి వుంటుందని అన్నారు. స్టాక్ మార్కెట్లకు నష్టం కలిగించాలన్న ఉద్దేశం తమకు లేదని, ఇదే సమయంలో తమ ఆర్థిక వ్యవస్థ కుప్పకూలకుండా చూసుకోవాల్సిన బాధ్యత తమపై ఉందని తెలిపారు.