: తాప్సీని కన్నీరు పెట్టించిన అభిమాని లేఖ!
సూజిత్ సర్కార్ దర్శకత్వంలో అమితాబ్ బచ్చన్, తాప్సీ ప్రధాన పాత్రల్లో నటించిన ‘పింక్’ చిత్రం ఇటీవల విడుదలై ప్రేక్షకుల మన్ననలు పొందింది. సమాజంలో నేటి మహిళలు ఎదుర్కొంటున్న ఒక సమస్యను ఇతివృత్తంగా తీసుకుని ఈ సినిమా తీశారు. అయితే, ఈ సినిమా చూసి చలించిపోయిన ఒక యువతి తన ట్విట్టర్ ఖాతా ద్వారా తాప్సీకి లేఖ రాసింది. 'డియర్ తాప్పీ... మీరు క్షేమంగా ఉన్నారని అనుకుంటున్నాను. నేనెవరో మీకు చెప్పే ముందు ఈ లేఖ ఎందుకు రాస్తున్నానో చెప్పాలి. మీరు నటించిన పింక్ సినిమా చాలా బాగుంది. ఎప్పుడూ పద్ధతులు, సంప్రదాయాలకు కట్టుబడి ఉండే ఒక మధ్య తరగతి కుటుంబంలో నేను పుట్టిపెరిగాను. చదువు నిమిత్తం ఢిల్లీకి వచ్చినప్పుడు.. జీవితమంటే కేవలం విలువలు, పద్ధతులు మాత్రమే కాదన్న విషయాన్ని తెలుసుకున్నాను. ఈ సినిమాలో చూపించిన సంఘటనలే మనం జీవితంలో ఎదుర్కొని ఉంటాం. కానీ, ఎంతమంది దీనిని సమర్ధంగా ఎదుర్కోగలిగారు? తాప్పీ, మీకు అది కేవలం పాత్ర మాత్రమే కావొచ్చు. కానీ, ఆ ఒక్క పాత్రతో ఎందరో ఆడపిల్లలకు స్ఫూర్తిగా నిలిచారు. ఇప్పటికిప్పుడు ఆడపిల్లల్లో మార్పు రాకపోవచ్చు. కానీ, ఆ మార్పునకు మీరు శ్రీకారం చుట్టారు’ అంటూ ఆ యువతి ఆ లేఖలో పేర్కొంది. కాగా, ఈ ట్వీట్ కు స్పందించిన తాప్పీ.. ఈ లేఖ తన చేత కన్నీరు పెట్టించిందని చెప్పింది. ‘పింక్’ అనేది ఒక ఉద్యమం కావాలని, అందుకోసం, అందరూ చేతులు కలుపుదామంటూ తాప్సీ ప్రతిస్పందించింది.