: రూ. 115 విలువైన డ్రింక్ తాగిందని పనిలోంచి తీసేసి... ఇప్పుడు రూ. 1.86 కోట్లు పరిహారంగా ఇచ్చుకుంటున్న రిటైల్ దిగ్గజం!
ఏదైనా రుగ్మతలతో బాధపతుతున్న వారు, ముఖ్యంగా మధుమేహంతో బాధపడుతున్న వారు మీ దగ్గర పనిచేస్తుంటే వారికి అవసరమైన ఆహార పదార్థాలను ఎప్పుడంటే అప్పుడు తీసుకునేందుకు అనుమతించాల్సిందేనని, లేకుంటే పరిణామాలు ఎలా ఉంటాయో వెల్లడిస్తోందీ ఘటన. అమెరికాలో రిటైల్ చైన్ నడుపుతున్న డాలర్ జనరల్ కు పాఠం నేర్పిందీ ఘటన. కేవలం 1.69 డాలర్ల (సుమారు రూ. 115) విలువైన ఆరంజ్ జ్యూస్ ను ముందు డబ్బు చెల్లించకుండా తాగిందని పనిలోంచి తీసేసిన సంస్థ ఇప్పుడామెకు పరిహారంగా 2,77,656 డాలర్లు (సుమారు రూ. 1.86 కోట్లు) పరిహారంగా ఇచ్చుకోనుంది. మరిన్ని వివరాల్లోకి వెళితే... అది సెప్టెంబర్ 2014. తెన్నిస్సీ పరిధిలోని మ్యారీవిల్లీలోని డాలర్ జనరల్ స్టోర్. అక్కడ మధుమేహ వ్యాధితో బాధపడుతున్న యువతి క్యాషియర్ గా పనిచేస్తోంది. తనకు ఏ సమయంలోనైనా హైపోగ్లైసీమియా (రక్తంలో గ్లూకోజ్ శాతం పడిపోవడం) రావచ్చని, తన పక్కనే ఓ జ్యూస్ పెట్టుకుంటానని ఆమె చెబితే, అది స్టోర్ రూల్స్ కు విరుద్ధమంటూ సూపర్ వైజర్ అంగీకరించలేదు. ఒక రోజు ఆమెకు తీవ్ర నీరసం వచ్చింది. వెంటనే పక్కనే ఉన్న ఆరంజ్ జ్యూస్ ను తీసుకుని తాగేసింది. ఆపై పన్నులు సహా 1.69 డాలర్లను కట్టింది కూడా. అయితే, ముందుగా డబ్బు చెల్లించకుండా జ్యూస్ తాగిందన్న అభియోగం మోపిన డాలర్ జనరల్ అధికారులు, ఆమెను విధుల నుంచి తీసేశారు. అయితే, ఆమె ఊరుకోలేదు. తనకు జరిగిన అన్యాయాన్ని పేర్కొంటూ, అమెరికా ఈఈఓసీ (ఈక్వల్ ఎంప్లాయ్ మెంట్ ఆపర్చ్యునిటీ కమిషన్) ముందు యువతి కేసు వేసింది. కేసును విచారించిన జ్యూరీ, ఆమెకు అనుకూలంగా తీర్పునిస్తూ, 2.5 లక్షల డాలర్ల జరిమానాను, తొలగించిన నాటి నుంచి తీర్పిచ్చేంత వరకూ ఆమెకు రావాల్సిన వేతనం 27,565 డాలర్లను చెల్లించాలని తీర్పిచ్చింది. అమెరికన్ డిజబిలిటీ చట్టాల ప్రకారం, రుగ్మతలతో ఉన్న ఉద్యోగులు, వారికి సంబంధించిన ఔషధాలు, పానీయాలను పక్కన పెట్టుకునే హక్కును కలిగివుంటారని, ఉద్యోగుల హక్కును డాలర్ జనరల్ కాలరాసిందని జ్యూరీ వ్యాఖ్యానించింది. ఈ తీర్పు తనకు సంతృప్తిని కలిగించిందని బాధితురాలు వ్యాఖ్యానించింది.