: 3.9 కోట్లు కొట్టేస్తే... 2 కోట్లు ఉంచుకుని...దొంగలకు 1.9 కోట్లు పంచిన పోలీసులు!
దొంగిలించిన డబ్బును దొంగలు, పోలీసులు కలిసి పంచుకున్న ఘటన తమిళనాడులోని కోయంబత్తూరులో చోటుచేసుకుంది. ఆలస్యంగా వెలుగు చూసిన ఈ ఘటన వివరాల్లోకి వెళ్తే...కేరళలోని మలప్పురంలో ఓ బంగారు వ్యాపారి వద్ద పనిచేసే నలుగురు వ్యక్తులు గత ఆగస్టు 25న చెన్నైలో యజమాని చెప్పినట్టు నగలు అమ్మి, ఆ డబ్బు తీసుకుని కారులో మలప్పురంకు తిరుగుప్రయాణమయ్యారు. మార్గమధ్యంలో ఐదుగురు వ్యక్తులు కారును అడ్డుకున్నారు. వారిలో ముగ్గురు వ్యక్తులు యూనిఫాంలో ఉండడంతో వారు కారును ఆపారు. తనిఖీలు చేయాలని కిందికి దిగాలని ఆదేశించడంతో ఆ నలుగురూ కిందికి దిగారు. దీనిని అవకాశంగా తీసుకున్న ఆ వ్యక్తులు కారుతో ఉడాయించారు. దీంతో బాధితులు లబోదిబోమంటూ యజమానికి ఫిర్యాదు చేయగా, ఆయన పోలీసులకు ఫిర్యాదు చేశారు. దీంతో కేసు నమోదుచేసిన పోలీసులు, దర్యాప్తు చేపట్టారు. వారి దర్యాప్తులో ఈ దోపిడీలో పోలీసుల హస్తం కూడా ఉందని గుర్తించారు. నిందితులు ముగ్గుర్ని అదుపులోకి తీసుకుని విచారించగా, దొంగిలించిన 3.9 కోట్ల రూపాయలను పోలీసులు, దొంగలు కలసి పంచుకున్నారని వెల్లడైంది. మొత్తం 3.9 కోట్ల రూపాయల్లో 2 కోట్ల రూపాయలను పోలీసులు తీసుకుని, మిగిలిన 1.9 కోట్ల రూపాయలను దొంగలకు పంచిపెట్టారని వారు తెలిపారు. దీంతో ఒక పోలీస్ ఇన్ స్పెక్టర్ ను అదుపులోకి తీసుకున్న పోలీసులు, పరారీలో ఉన్న మరో ఇన్ స్పెక్టర్, హెడ్ కానిస్టేబుల్ కోసం గాలిస్తున్నారు.