: తెలంగాణ ప్రాజెక్టులపై చంద్రబాబు కేంద్రం ముందు మొండిగా వాదిస్తున్నారు: మంత్రి హరీశ్‌రావు
కేంద్రమంత్రి ఉమాభారతి అధ్యక్షతన అపెక్స్ కమిటీ సమావేశం జరుగుతున్న సందర్భంగా తెలంగాణ భారీ నీటి పారుదల శాఖ మంత్రి హరీశ్‌రావు ఈ రోజు ఢిల్లీలో పర్యటిస్తున్నారు. ఈ సందర్భంగా ఆయన మీడియాతో మాట్లాడుతూ ఏపీ నేతలపై తీవ్ర ఆగ్రహాన్ని వ్యక్తం చేశారు. తెలంగాణ ప్రాజెక్టులకు ఏపీ నేతలు ఇంకా అడ్డుతగులుతూనే ఉన్నారని ఆయన అసహనం వ్యక్తం చేశారు. డిండి, పాలమూరు ప్రాజెక్టులు కొత్త ప్రాజెక్టులంటూ ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు కేంద్రం ముందు మొండిగా వాదిస్తున్నారని ఆయన మండిపడ్డారు. ఆ ప్రాజెక్టులకు ఉమ్మడి రాష్ట్రంలోనే జీవోలు జారీ అయ్యాయని ఆయన అన్నారు. ఏపీలో ప్రాజెక్టులు కడితే ఒప్పు.. మేం కడితే తప్పా? అని ఆయన ప్రశ్నించారు. ప్రాజెక్టుల వివరాలన్నీ అపెక్స్ కమిటీ ముందుంచుతామని తెలిపారు.