: ఎప్పుడు, ఎక్కడ దెబ్బకొట్టాలో మాకు తెలుసు: భారత సైన్యం


సీమాంతర ఉగ్రవాదాన్ని ప్రోత్సహిస్తూ, ఉగ్రవాదులను భారత్ పైకి ఉసిగొల్పుతున్న పాకిస్థాన్ పై ఎప్పుడు, ఎక్కడ దెబ్బకొట్టాలో తమకు తెలుసునని భారత సైనిక కార్యకలాపాల విభాగం డైరెక్టర్ జనరల్ లెఫ్టినెంట్ జనరల్ రణబీర్ సింగ్ వ్యాఖ్యానించారు. ఎదురుదాడికి సమయం, స్థలం ఎంచుకునే హక్కు తమకుందని ఆయన అన్నారు. పాక్ వైఖరికి దీటైన సమాధానం చెప్పగల సత్తా భారత సైన్యానికి ఉందని ఆయన అన్నారు. పాక్ ఆక్రమిత కాశ్మీర్ పరిధిలోని తీవ్రవాద క్యాంపులే లక్ష్యంగా విరుచుకుపడాలని కొందరు మాజీ సైనికులు, రాజకీయ నేతలు సలహాలు ఇస్తున్న వేళ, రణబీర్ సింగ్ స్పందించారు. వాస్తవాధీన రేఖ ఆవలి నుంచి సాగుతున్న ఉగ్రవాద చర్యలకు అడ్డుకట్ట వేసి తీరుతామని, వారికి గుణపాఠం చెప్పి తీరుతామని అన్నారు. కాగా, ఇదే తరహా వ్యాఖ్యలను సైన్యాధికారులు గతంలోనూ చెప్పారు. 2013 జనవరి 8న భారత సైనికుడి తలను పాకిస్థాన్ ప్రేరేపిత ఉగ్రవాదులు నరికిన వేళ, నాటి ఆర్మీ చీఫ్ జనరల్ విక్రమ్ సింగ్ సైతం ఇలానే మాట్లాడారు. ఆపై పఠాన్ కోట్ పై ఉగ్రదాడి అనంతరం రక్షణ మంత్రి మనోహర్ పారికర్ సైతం ఇవే వ్యాఖ్యలు చేశారు. కానీ, తీసుకున్న చర్యలు లేవని, అందుకే ఉగ్రవాదులు రెచ్చిపోతున్నారని, ఈ దఫా ఉపేక్షించ వద్దని పలువురు సూచిస్తున్నారు.

  • Loading...

More Telugu News