: నిజాం కబంధ హస్తాల నుంచి తెలంగాణకు విముక్తి కల్పించిన అమరవీరులకు ధన్యవాదాలు: అమిత్ షా
అరాచక పాలకుడైన నిజాం కబంధ హస్తాల నుంచి తెలంగాణకు విముక్తి కల్పించిన ఎందరో అమరవీరులకు ధన్యవాదాలని బీజేపీ జాతీయ అధ్యక్షుడు అమిత్ షా తెలిపారు. హన్మకొండలో ఆయన మాట్లాడుతూ, సెప్టెంబర్ 17 తెలంగాణ విముక్తి దినం మాత్రమే కాదని, భారత ప్రధాని నరేంద్ర మోదీ పుట్టిన రోజు కూడా అని అన్నారు. ఆగస్టు 15న భారత దేశానికి స్వాతంత్ర్యం లభించగా, కేవలం హైదరాబాదు రాష్ట్రానికి మాత్రం ఆ స్వాతంత్ర్యఫలాలు అందలేదని ఆయన అన్నారు. సర్దార్ వల్లభాయ్ పటేల్ దూకుడుతో నిజాం తోకముడవడంతో తెలంగాణ, మరఠ్వాడా ప్రాంతాలకు స్వాతంత్ర్యం లభించిందన్నారు. సెప్టెంబర్ 17ను విముక్తి దినోత్సవంగా నిర్వహించుకునేందుకు మహారాష్ట్ర ముఖ్యమంత్రి, కర్ణాటక ముఖ్యమంత్రికి ఎలాంటి ఇబ్బంది లేదని, కేవలం తెలంగాణ ముఖ్యమంత్రి మాత్రమే విమోచన దినోత్సవం నిర్వహించేందుకు సిగ్గుపడుతున్నారని ఆయన తెలిపారు. అయితే తాము మాత్రం విమోచన దినోత్సవం నిర్వహిస్తామని ఆయన స్పష్టం చేశారు.