నేను బతికున్నాగా?... ఏమీ కాదు!: బాబాయ్, అబ్బాయ్ లను కలిపిన అనంతరం ములాయం
Get Instant Access to ap7am Free web app · Opens in one tap Install

నేను బతికున్నాగా?... ఏమీ కాదు!: బాబాయ్, అబ్బాయ్ లను కలిపిన అనంతరం ములాయం

ఉత్తరప్రదేశ్ లో నెలకొన్న రాజకీయ సంక్షోభాగ్నిని ఆర్పివేసేందుకు తన వంతు ప్రయత్నాలు సాగించిన సమాజ్ వాదీ అధినేత ములాయం సింగ్ యాదవ్, లక్నోలో పార్టీ కార్యకర్తలను ఉద్దేశించి మాట్లాడారు. తాను బతికున్నంత వరకూ పార్టీ విడిపోబోదని, తమది ఓ పెద్ద కుటుంబం కాబట్టి చిన్న చిన్న అభిప్రాయ భేదాలు సహజమేనని అన్నారు. తానున్నంత వరకూ ఎవరూ కూడా తమ కుటుంబంలో చిచ్చు పెట్టలేరని స్పష్టం చేశారు. ఈ ఉదయం పార్టీ కార్యాలయానికి వచ్చిన ఆయన సోదరుడు శివపాల్ యాదవ్, కుమారుడు అఖిలేష్ యాదవ్ లతో విడివిడిగా సమావేశమై మాట్లాడారు. వారి మధ్య సయోధ్యను కుదిర్చారు. శివపాల్ రాజీనామాను తిరస్కరిస్తున్నట్టు అఖిలేష్ తో చెప్పించారు. ఆపై ఇద్దరినీ తీసుకుని తన ఇంటికి వెళ్లారు ములాయం. అక్కడ అందరూ కలిసి మధ్యాహ్న భోజనం చేశారు. తండ్రీకొడుకుల మధ్యే తేడాలు వస్తుంటాయని చెప్పిన ఆయన, మీడియా ముందు మాట్లాడుతూ చెప్పిన ఓ చిన్న మాట కారణంగానే ఇంత రభస జరిగిందని, ఇప్పుడంతా సమసిపోయిందని అన్నారు. ఆపై అఖిలేష్ మాట్లాడుతూ, ఓ ముఖ్యమంత్రిగా రాష్ట్ర ప్రజలకు సేవలందించడంతో పాటు, ఓ కొడుకుగా తన తండ్రిని సంతోషపెట్టాల్సిన బాధ్యత తనపై ఉందని, ఆయన మాటను తాను జవదాటబోనని అన్నారు. ఈ రభసకు కారణమైన వ్యక్తిపై చర్యలు తీసుకునేందుకు తన తండ్రి అంగీకరించారని, అమర్ సింగ్ పేరు చెప్పకుండా వ్యాఖ్యలు చేశారు. మంత్రి పదవికి తన బాబాయ్ శివపాల్ యాదవ్ చేసిన రాజీనామాలను తిరస్కరిస్తున్నట్టు చెప్పారు. పార్టీని తదుపరి ఎన్నికల్లో గెలిపించడమే లక్ష్యంగా తాము కలసి పనిచేస్తామని స్పష్టం చేశారు.

More Telugu News