: ప్యాకేజీ కోసమే ఎంతో కష్టపడ్డాం... ఎంతిచ్చినా తీసుకుంటాం: యనమల
కేంద్ర ప్రభుత్వం నుంచి రాష్ట్రాభివృద్ధికి సహకరించే ప్యాకేజీని రాబట్టాలని తెలుగుదేశం ప్రభుత్వం ఎంతో కష్టపడిందని, హోదా విషయమై పోరాడుతూనే సాధ్యమైనంత ఎక్కువ ప్యాకేజీని సాధించుకున్నామని ఆంధ్రప్రదేశ్ ఆర్థిక మంత్రి యనమల రామకృష్ణుడు వ్యాఖ్యానించారు. ఈ ఉదయం తూర్పుగోదావరి జిల్లా పర్యటనకు వచ్చిన ఆయన, తునిలో జరిగిన ఓ కార్యక్రమంలో మాట్లాడారు. కేంద్రం నుంచి ఎంత వచ్చినా తీసుకుంటామని, ఈ విషయంలో అభివృద్ధి నిరోధకులైన విపక్షాల సలహాలు తమకు అక్కర్లేదని అన్నారు. కేంద్రం నిధులను స్వీకరించడం మినహా, ప్రస్తుతం మరో మార్గం ప్రభుత్వం ముందు లేదని అన్నారు. ఇంకా కావాల్సినవి అడిగి సాధించుకుంటామని తెలిపారు. ప్రతిపక్షాల వాదనను నమ్మవద్దని ప్రజలకు పిలుపునిచ్చిన యనమల, రాష్ట్రం కష్టాల సుడిగుండం నుంచి బయటపడాల్సి వుందని, అందుకు మరింత సమయం పడుతుందని అభిప్రాయపడ్డారు. సాయం చేస్తామని ముందుకు వచ్చే కేంద్రం నుంచి ప్యాకేజీలు వద్దని సలహాలు ఇవ్వడం దుర్మార్గమని విపక్షాలను ఉద్దేశించి విమర్శలు గుప్పించారు.