: ఏపీపీఎస్సీకి మరో ఐదుగురు సభ్యులు!... అంతా రాజకీయాలతో సంబంధం లేని వారే!


నవ్యాంధ్రలో కొత్త కొలువుల భర్తీకి రంగం సిద్ధమవుతున్న వేళ... నియామకాలు చేపట్టే కీలక బాధ్యతలు చేపట్టిన ఆంధ్రప్రదేశ్ పబ్లిక్ సర్వీస్ కమిషన్ (ఏపీపీఎస్సీ)ని మరింత బలోపేతం చేస్తూ చంద్రబాబు సర్కారు నిన్న కీలక నిర్ణయం తీసుకుంది. ఏపీపీఎస్సీకి ఇఫ్పటిదాకా చైర్మన్ తో పాటు ఒక్క సభ్యుడు మాత్రమే ఉన్నారు. నిన్న జారీ చేసిన ఉత్తర్వుల్లో ఆ సంస్థకు ఐదుగురు సభ్యులను నియమిస్తూ ప్రభుత్వం నిర్ణయం తీసుకుంది. కొత్తగా నియమితులైన వారంతా రాజకీయాలతో ఏమాత్రం సంబంధం లేని వారు కావడం గమనార్హం. కొత్త సభ్యుల్లో ముగ్గురు ప్రొఫెసర్లు కాగా, ఇద్దరు ప్రభుత్వ అధికారులున్నారు. ప్రొఫెసర్ల విషయానికొస్తే... అనంతపురం జేఎన్టీయూలో మెకానికల్ ఇంజినీరింగ్ విభాగంలో పనిచేస్తున్న ప్రొఫెసర్ జింకా నాగజనార్దన, హైదరాబాదులోని అంబేద్కర్ ఓపెన్ వర్సిటీలో లైబ్రరీ హెడ్ గా పనిచేస్తున్న ప్రొఫెసర్ గుర్రం కవిత, కాకినాడ జేఎన్టీయూలో ఈసీఈ విభాగంలో పనిచేస్తున్న పద్మరాజు... ఏపీపీఎస్సీ సభ్యులుగా నియమితులయ్యారు. ఇక ప్రభుత్వాధికారుల విషయానికొస్తే... డైరెక్టర్ ఆఫ్ ఎకనమిక్స్ అండ్ స్టాటిస్టిక్స్ లో జాయింట్ డైరెక్టర్ గా పనిచేస్తున్న విజయ్ కుమార్, రూరల్ డెవలప్ మెంట్ లో అకౌంట్స్ ఆఫీసర్ గా పనిచేస్తున్న సేవ రూపలను కూడా ప్రభుత్వం ఏపీపీఎస్సీ సభ్యులుగా నియమించింది. ఆరేళ్ల పదవీ కాలం, 62 ఏళ్ల వయసు... ఈ రెండింటిలో ఏది ముందు వస్తే దాని ప్రకారం వీరు పదవీ విరమణ చేయాల్సి ఉంటుంది.

  • Loading...

More Telugu News