: జయలలితతో సమావేశం ఏర్పాటు చేయండి: మోదీని కోరిన సిద్ధరామయ్య
కావేరీ జల వివాదంపై తమిళనాడు ముఖ్యమంత్రి జయలలితతో సమావేశం ఏర్పాటు చేయాలని కర్ణాటక ముఖ్యమంత్రి సిద్ధరామయ్య ప్రధాని నరేంద్ర మోదీకి లేఖ రాశారు. కావేరీ జలాలు తమిళనాడుకు విడుదల చేయడంపై రైతు సంఘాల పిలుపుమేరకు ఆ రాష్ట్ర ప్రజలు స్వచ్ఛందంగా బంద్ చేపట్టారు. అనంతరం రాష్ట్రంలో నెలకొన్న పరిస్థితులు, చేయాల్సిన పనులపై మోదీకి లేఖ రాశారు. అందులో మీ సమక్షంలోనే జయలలితతో సమావేశం ఏర్పాటు చేయాలని ఆయన కోరారు. రోజూ 15 వేల క్యూసెక్కుల నీరు తమిళనాడుకు విడుదల చేస్తే... కావేరీ నదీ పరీవాహక ప్రాంత రైతులు నష్టపోతారని ఆయన లేఖలో పేర్కొన్నారు. రాష్ట్రంలో ఇదే అనిశ్చితి కొనసాగితే ఐటీ పరిశ్రమకు కూడా సెగ తగులుతుందని, అలా జరిగితే దేశ ఆర్థిక వ్యవస్థకు కూడా దెబ్బతగులుతుందని ఆయన హెచ్చరించారు. సుప్రీంకోర్టు తీర్పును అమలు చేయవద్దని రాష్ట్ర బీజేపీ శాఖ కూడా చెబుతోందని ఆయన తెలిపారు. రాజ్యాంగబద్ధమైన పదవిలో ఉండడంతో తాను సుప్రీంకోర్టు తీర్పును గౌరవించి, అమలు చేస్తున్నానని ఆయన తెలిపారు. తమిళనాడు కంటే తమ పరిస్థితి మెరుగ్గా ఉందని ఆయన లేఖలో అంగీకరించారు. ఈ సమస్యను పరిష్కరించాలంటే రెండు రాష్ట్రాల ముఖ్యమంత్రులతో సమావేశం ఏర్పాటు చేయాలని ఆయన డిమాండ్ చేశారు.