: రిలయన్స్ జియో నుంచి వచ్చే కాల్స్ ను అనుమతించం: ప్రధానితో కుండబద్దలు కొట్టిన ఎయిర్ టెల్, ఐడియా


ఇండియాలో అసలైన టెలికం వార్ కు తెరలేచింది. అత్యాధునిక 4జీ ఎల్టీఈ వాయు తరంగాల ద్వారా తమ నెట్ వర్క్ లోని నంబర్లకు వచ్చే రిలయన్స్ జియో కాల్స్ ను అనుమతించే పరిస్థితి లేదని భారతీ ఎయిర్ టెల్, ఐడియా, వోడాఫోన్ తదితర టెలికం కంపెనీలు ప్రధాన సభ్యుదారులుగా ఉన్న సెల్యులార్ ఆపరేటర్స్ అసోసియేషన్ ఆఫ్ ఇండియా (కాయ్) నుంచి ప్రధాని నరేంద్ర మోదీ కార్యాలయానికి లేఖ అందింది. రిలయన్స్ జియో ఇన్ఫోకామ్ కోరిక మేరకు ఇంటర్ కనెక్ట్ పాయింట్లను ఇచ్చేందుకు అవసరమైన నెట్ వర్క్ లేదా ఆర్థిక వనరులు తమ వద్ద లేవని ఈ లేఖలో టెల్కోలు కుండబద్దలు కొట్టాయి. రిలయన్స్ జియో లాంచింగ్ గురించి ముఖేష్ అంబానీ ప్రకటన వెలువరించిన మరుసటి రోజు, అంటే, సెప్టెంబర్ 2వ తేదీతో ఉన్న లేఖలో తమకు రావాల్సిన కాల్ కనెక్టివిటీ చార్జీలు తగ్గిపోతాయని, దీన్ని భరించే శక్తి తమకు లేదని, డేటా ఆధారిత కాల్స్ తాము ఇవ్వలేమని సభ్య కంపెనీలు స్పష్టం చేస్తున్నట్టు కాయ్ వెల్లడించింది. ఇంటర్ కనెక్టివిటీ పాయింట్లను ఇచ్చేందుకు తామెందుకు భారాన్ని మోయాలని ఈ లేఖలో కాయ్ డైరెక్టర్ జనరల్ రాజన్ మ్యాథ్యూస్ ప్రశ్నించారు. ఇంటర్ కనెక్ట్ యూసేజ్ చార్జీలను ఇప్పుడున్న విధంగానే తమకు చెల్లించే పక్షంలో మాత్రమే తాము సహకరిస్తామని ఈ లేఖలో ఆయన స్పష్టం చేశారు. కాగా, ఇతర టెలికం కంపెనీలు జియో నుంచి తమ కస్టమర్లకు వచ్చే కాల్స్ ను కనెక్ట్ చేయడం లేదని ఇప్పటికే విమర్శలు వస్తున్న సంగతి తెలిసిందే. జియో నుంచి ఇతర నెట్ వర్క్ మొబైల్ ఫోన్లకు కాల్ చేస్తుంటే వెళ్లడం లేదు. ఈ నేపథ్యంలో తాము జియోకు సహకరించలేమంటూ, కాయ్ రాసిన లేఖ ఎటువంటి పరిణామాలకు దారితీస్తుందో వేచి చూడాలి.

  • Loading...

More Telugu News