: మద్యం మత్తులో యువతి వీరంగం!... పోలీస్ స్టేషన్ లోనే ప్రియుడితో ముద్దులాట!


కర్ణాటక రాజధాని బెంగళూరుకు చెందిన ఓ యువతి తమిళనాడులోని వేలూరులో వీరంగమాడింది. ప్రియుడితో కలిసి మద్యం సేవించిన ఆ యువతి... బైకును ర్యాష్ గా నడుపుతున్నారెందుకంటూ ప్రశ్నించిన వ్యక్తిపై విరుచుకుపడింది. రోడ్డుపై ఈ న్యూసెన్స్ ఏమిటంటూ అడ్డుకోబోయిన ట్రాఫిక్ కానిస్టేబుల్ చొక్కా చించి మరీ దాడి చేసింది. ఇక అరెస్ట్ చేసేందుకు వచ్చిన మహిళా ఎస్సైపైనా ఆ యువతి విరుచుకుపడింది. ఎలాగోలా పోలీస్ స్టేషన్ కు తరలించిన ఆ యువతి ఖాకీల ముందే ప్రియుడితో ముద్దులాట మొదలెట్టింది. దీంతో షాక్ తిన్న పోలీసులు...వారిని విడదీసి ప్రియుడిపై ర్యాష్ డ్రైవింగ్ కేసు పెట్టి, పోలీసులపై దాడి చేసిన కేసులో ఆ యువతిని మాత్రం సెంట్రల్ జైలుకు తరలించారు. వివరాల్లోకెళితే... బెంగళూరుకు చెందిన అర్చన తమిళనాడులోని తుత్తిపట్టులోని కామరాజనగర్ కు చెందిన వివేకానంద్ తో ప్రేమలో పడింది. మొన్న వేలూరులో ప్రత్యక్షమైన ఈ ప్రేమ జంట ఫుల్లుగా మద్యం కొట్టి బైక్ పై రోడ్డెక్కింది. వివేకానంద్ బైక్ ను అడ్డదిడ్డంగా నడుపుతుంటే వెనుకే కూర్చున్న అర్చన ఎంజాయ్ చేస్తూ ముందుకు సాగింది. ఈ క్రమంలో వారి బైకు ఓ కారును రాసుకుపోయింది. ర్యాష్ డ్రైవింగ్ ఏంటంటూ ఆ కారు యజమాని ప్రశ్నించగా ఒక్క ఉదుటన బైక్ దిగిన అర్చన ఆయనపై చేయి చేసుకుంది. పరుగు పరుగున అక్కడకు వచ్చిన ట్రాఫిక్ కానిస్టేబుల్ పైనా ఆమె దాడి చేసింది. దీంతో సమాచారం అందుకున్న మహిళా ఎస్సై తన సిబ్బందితో కలిసి అక్కడకు వచ్చి అర్చనను పోలీస్ స్టేషన్ కు తరలించారు. పోలీస్ స్టేషన్ లోనూ వీరంగమాడిన అర్చన... అక్కడికక్కడే వివేకానంద్ ను కౌగిలించుకుని ముద్దులాట మొదలెట్టింది. ఇలాగైతే కుదరదని భావించిన పోలీసులు వివేకానంద్ పై ర్యాష్ డ్రైవింగ్ కేసు పెట్టి అతడిని పంపించివేసి, అర్చనను మాత్రం దాడి చేసిన నేరంపై న్యాయమూర్తి ముందు హాజరుపరిచారు. ఆ తర్వాత జడ్జి ఆదేశాల మేరకు ఆమెను సెంట్రల్ జైలుకు తరలించారు.

  • Loading...

More Telugu News