: పెట్టే బేడా సర్దండి!... ఏపీ పర్యాటక శాఖ సిబ్బందికి శ్రీకాంత్ ఆదేశం!
నవ్యాంధ్ర నూతన రాజధాని అమరావతికి ఏపీ కార్యాలయాల తరలింపు దాదాపుగా పూర్తి అయ్యింది. ఆర్థిక శాఖ సహా అన్ని ప్రభుత్వ కార్యాలయాలు అమరావతిలో ఓపెన్ అయిపోయాయి. ఆయా శాఖల కమిషనరేట్ కార్యాలయాలు కూడా విజయవాడ, గుంటూరు పరిధిలోకి మారిపోయాయి. అయితే ఏపీ పర్యాటక శాఖ కమిషనరేట్ సిబ్బంది మాత్రం ఇంకా హైదరాబాదు నుంచే కార్యకలాపాలు సాగిస్తున్నారు. అన్ని కార్యాలయాల సిబ్బంది ఏపీకి తరలిపోయినా పర్యాటక శాఖ సిబ్బంది ఆ దిశగా అడుగు వేసేందుకు మొగ్గుచూపడం లేదు. ఈ క్రమంలో నిన్న ఆ శాఖ ముఖ్యకార్యదర్శి నాగులపల్లి శ్రీకాంత్ వారికి స్పష్టమైన ఆదేశాలు జారీ చేశారు. ఉన్నపళంగా కార్యాలయాన్ని ఏపీకి తరలించాలని ఆయన ఆదేశించారు. బెజవాడలోని బందరు రోడ్డులో పర్యాటక శాఖ కమిషనరేట్ కార్యాలయానికి స్థలాన్ని కూడా ఎంపిక చేశామని, వెంటనే అక్కడికి వచ్చేయాలని ఆయన ఆదేశించడంతో సిబ్బంది త్వరలోనే అక్కడికి తరలివెళ్లనున్నారు.