: డొనేషన్ పాలసీకి దిద్దుబాటు.. హిల్లరీ ఎన్నికైతే విదేశీ విరాళాలకు ‘క్లింటన్ ఫౌండేషన్’ చెక్
అమెరికా అధ్యక్షురాలిగా హిల్లరీ క్లింటన్ ఎన్నికైతే విరాళాల విషయంలో ఇప్పటి వరకు అనుసరిస్తున్న విధానానికి చరమగీతం పాడాలని క్లింటన్ ఫౌండేషన్ భావిస్తోంది. ఇక నుంచి విదేశాల నుంచి, కార్పొరెట్ సంస్థల నుంచి విరాళాలు స్వీకరించరాదని నిర్ణయించింది. అమెరికా మాజీ అధ్యక్షుడు బిల్ క్లింటన్ గురువారం ఫౌండేషన్ సిబ్బందితో సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ నవంబరులో అధ్యక్ష ఎన్నికలు జరగనున్న నేపథ్యంలో సెప్టెంబరులో న్యూయార్క్‌లో జరగనున్న క్లింటన్ గ్లోబల్ ఇనేషియేటివ్ మీటింగ్‌ను తాత్కాలికంగా రద్దు చేసినట్టు పేర్కొన్నారు. అలాగే ఎన్నికల్లో హిల్లరీ గెలిచి అధ్యక్షురాలైతే క్లింటన్ ఫౌండేషన్ విదేశీ విరాళాలను స్వీకరించదని తెలిపారు. అంతేకాక కార్పొరెట్ సంస్థల నుంచి కూడా విరాళాలు స్వీకరించబోదని తేల్చి చెప్పారు. కేవలం అమెరికా పౌరులు, స్వతంత్ర ధార్మిక సంస్థల నుంచి మాత్రమే విరాళాలు తీసుకుంటామని వివరించారు. క్లింటన్ ఫౌండేషన్ తన కార్యకలాపాలను కొనసాగిస్తుందని బిల్ క్లింటన్ స్పష్టం చేశారు.