: ‘మహా’ రాజ్‌భవన్‌లో బ్రిటిష్ కాలంనాటి బంకర్.. కనుగొన్న గవర్నర్ విద్యాసాగర్‌రావు
బ్రిటిష్ కాలం నాటి అద్భుతమైన బంకర్ ఒకటి తాజాగా బయటపడింది. మహారాష్ట్ర రాజ్‌భవన్‌లో ఉన్న దీనిని గవర్నర్ విద్యాసాగర్‌రావు కనుగొన్నారు. 150 మీటర్ల పొడవులో నిర్మించిన దీనిలో సకల సదుపాయాలు ఉన్నాయి. మొత్తం 5వేల చదరపు అడుగులలో నిర్మించిన ఈ బంకర్లో 13 గదులు ఉన్నాయి. బాంబ్‌షెల్ స్టోర్, గన్‌షెల్, కాట్రిడ్జ్ స్టోర్, షెల్ లిఫ్ట్, పంప్, వర్క్‌షాప్‌ల కోసం ప్రత్యేకంగా గదులను కేటాయించారు. తాజా గాలి, వెలుతురు వచ్చేందుకు ప్రత్యేక ఏర్పాట్లు ఉన్నాయి. డ్రైనేజీ సిస్టం కూడా ఉండడం గమనార్హం. రాజ్‌భవన్ లోపల బంకర్ ఉన్నట్టు మూడు నెలల క్రితం పాతతరం సిబ్బంది ద్వారా తెలుసుకున్న గవర్నర్ దాని గురించి తెలుసుకోవాలని అధికారులను ఆదేశించారు. ఈనెల 12న పబ్లిక్స్ వర్క్స్ డిపార్ట్మెంట్ సిబ్బంది రాజ్‌భవన్‌లోని తాత్కాలికంగా ఏర్పాటు చేసిన గోడను తెరవగానే ఈ బంకర్ బయటపడినట్టు ప్రభుత్వం పేర్కొంది. మంగళవారం భార్య వినోదతో కలిసి గవర్నర్ బంకర్‌ను సందర్శించారు. చరిత్రకారుల కథనం ప్రకారం ప్రస్తుతం రాజ్‌భవన్‌గా ఉంటున్న ఈ భవనం 1885లో అప్పటి లార్డ్ రీయ్ శాశ్వత నివాసం. అంతకుమందు దీనిని బ్రిటిష్ గవర్నర్లు వేసవి విడిదిగా ఉపయోగించుకునేవారు.