: మెదక్ జిల్లాలో ఎస్సై ఆత్మహత్య!... క్వార్టర్స్ లోనే సర్వీస్ రివాల్వర్ తో కాల్చుకున్న వైనం!
మెదక్ జిల్లాలో నేటి తెల్లవారుజామున దారుణం జరిగిపోయింది. గతంలో ఇండియన్ ఆర్మీలో పనిచేసి ఆ తర్వాత పోలీసు శాఖలో చేరి ఎస్సైగా విధులు నిర్వర్తిస్తున్న రామకృష్ణారెడ్డి ఆత్మహత్య చేసుకున్నారు. జిల్లాలోని కొండపాక మండలం కుకునూరుపల్లిలో ఈ ఘటన చోటుచేసుకుంది. నల్లగొండ జిల్లా బుక్కమంత్రగూడెంకు చెందిన రామకృష్ణారెడ్డి... ప్రస్తుతం కుకునూరుపల్లి పోలీస్ స్టేషన్ లో ఎస్సైగా పనిచేస్తున్నారు. కారణాలేమిటో తెలియదు కాని, తెల్లవారుజామున ఆయన తన క్వార్టర్ లోనే సర్వీస్ రివాల్వర్ తో కాల్చుకున్నారు. బుల్లెట్ శరీరంలోకి దూసుకెళ్లడంతో ఆయన అక్కడికక్కడే చనిపోయారు. రామకృష్ణారెడ్డికి భార్య, ఇద్దరు పిల్లలున్నారు. ప్రస్తుతం ఆయన మృతదేహాన్ని గజ్వేల్ ఏరియా ఆసుపత్రికి తరలించారు. జిల్లా ఎస్పీ చంద్రశేఖరరెడ్డి ఆయన మృతదేహాన్ని సందర్శించారు.