: సిగ్గు చేటు... మువ్వన్నెలకు అర్థం తెలిసిన వారు అతి కొద్ది మందే!


భారత జాతీయ పతాకంలో కనిపించే కాషాయం, తెలుపు, ఆకుపచ్చ రంగులు దేన్ని ప్రతిబింబిస్తాయి? ఈ మువ్వన్నెలకు అర్థమేంటి? భారత యువతలో మూడు రంగులకు సంబంధించిన ప్రశ్నలను సంధిస్తూ పోదార్ ఇనిస్టిట్యూట్ ఆఫ్ ఎడ్యుకేషన్ వివిధ మెట్రో నగరాల్లో సర్వే నిర్వహిస్తే సిగ్గు పడాల్సిన ఫలితాలు వెల్లడయ్యాయి. 18 నుంచి 23 సంవత్సరాల మధ్య ఉన్న యువత టార్గెట్ గా సర్వే జరుపగా, చెన్నైలోని 92 శాతం మంది ఈ రంగులకు అర్థం తమకు తెలియదని చెప్పారు. బెంగళూరులో 88 శాతం, ముంబైలో 90 శాతం మంది ఏ రంగు దేనికి సంకేతమో తెలియదన్నారు. ఇక ఇవే ప్రశ్నలకు రెండు ఆప్షన్లు ఇచ్చి, ఓ దాన్ని ఎంచుకోవాలని కోరగా, చెన్నైలో 20 శాతం, బెంగళూరులో 35 శాతం, ముంబైలో 22 శాతం మంది సరైన సమాధానాలు ఇచ్చారు. ఇక వీరినే జాతీయ గీతం పాడాలని చెప్పగా, 40 శాతం మంది మాత్రమే సరిగ్గా పాడారు. జాతీయ గీతాన్ని తప్పుల్లేకుండా రాయగలరా? అని కోరగా, చెన్నైలోని 28 శాతం, బెంగళూరులోని 34 శాతం, ముంబైలోని 42 శాతం మంది రాస్తామని చెప్పారు. ఇదే గీతాన్ని ఎవరు రాశారు? అని ప్రశ్నిస్తూ, రవీంద్రనాథ్ టాగూర్ పేరును ఓ ఆప్షన్ గా ఇస్తే, చెన్నైలో 38 శాతం, బెంగళూరులో 49 శాతం, ముంబైలో 53 శాతం మంది యువత సరైన సమాధానం చెప్పారు. మే నుంచి ఆగస్టు తొలివారం వరకూ కాలేజీ క్యాంపస్ లు, మెట్రో స్టేషన్లు, కాఫీ షాపుల్లో ఈ సర్వేను చేశామని పోదార్ ఇనిస్టిట్యూట్ డైరెక్టర్ స్వాతి పోపత్ వెల్లడించారు. ఈ ఫలితాలు తమకు దిగ్భ్రాంతిని కలిగించాయని అన్నారు. దేశం పట్ల, జాతీయ పతాకం పట్ల కనీస అవగాహన లేకపోయిందని తెలిపారు.

  • Loading...

More Telugu News