: జాక్ పాట్ అంటే అతనిదే... మంచి రేటుకి ఇల్లు అమ్మేసినా అందులోనే ఉంటున్నాడు!


కష్టపడి కట్టుకున్న ఇంటినో... లేక ఇష్టపడి పెంచుకున్న పూల తోటనో ప్రజా ప్రయోజనాల కిందో, వేరే అవసరాల రీత్యానో ప్రభుత్వాలు తీసుకున్న సందర్భాలకు కొదవలేదు. అయితే, ఆ ఆస్తికి ప్రభుత్వ లెక్కల ప్రకారం డబ్బు చెల్లించి, ఖాళీ చేసేందుకు కొంత గడువివ్వడమనేది ఆనవాయతీ. అయితే, ఎడారి పరిరక్షణ నిమిత్తం అమెరికాలోని ఆరిజోనా ప్రాంత నివాసి అయిన షాన్ మర్ఫీ భవంతిని అక్కడి ప్రభుత్వం ఆమోదయోగ్యమైన డబ్బు చెల్లించి తీసుకుంది. కానీ, అతన్ని మాత్రం జీవితాంతం ఆ భవంతిలోనే ఉండమని చెప్పింది. దీంతో, డబ్బుకు డబ్బుకు, తాను ఇష్టపడి కట్టుకున్న ఇంట్లోనే జీవితాంతం ఉండొచ్చన్న ప్రభుత్వ అనుమతి లభించడంతో మర్ఫీ ఆనందానికి హద్దుల్లేకుండా పోయింది. ఆరిజోనా ప్రాంతంలోని ఎడారి పరిరక్షణ చేబట్టాలని అమెరికా ప్రభుత్వం నిర్ణయించుకుంది. ఈ క్రమంలో 1990 లోనే మూడు వేల ఎకరాల ఎడారి ప్రాంతాన్ని పరిరక్షించేందుకుగాను ‘ద మెక్ డొవెల్ సొనొరన్ ప్రిజర్వ్’ ను ఏర్పాటు చేసింది. దాని పరిధిని 30 వేల ఎకరాలకు విస్తరింపజేయడంతో భూములను కూడా సేకరిస్తోంది. ఈ పరిధిలోకి మర్ఫీ ఇల్లు కూడా వస్తుంది. దీంతో, ఈ ఇంటిని అమ్మివేయాలని అతనిని ప్రభుత్వ అధికారులు కోరారు. రూ.18 కోట్లు చెల్లిస్తామని చెప్పారు. అయితే, ఈ ధర తనకు గిట్టుబాటు కాదని, రూ.45 కోట్లకు అయితే తన ఇంటిని విక్రయిస్తానని మర్ఫీ చెప్పాడు. దీంతో ఇద్దరికీ ఆమోదయోగ్యమైన ఒక ధరను ప్రభుత్వం నిర్ణయించింది. చివరకు రూ.27 కోట్లకు తన ఇంటిని విక్రయించేందుకు అతను ఓకే చెప్పాడు. ఇంటిని విక్రయించేస్తే అక్కడి నుంచి వెళ్లిపోక తప్పదనుకున్న మర్ఫీకి ప్రభుత్వం చల్లటి వార్త చెప్పింది. తన భవనాన్ని విక్రయించినప్పటికీ ఆ భవంతిలోనే అతను తన జీవితాంతం ఉండవచ్చని ప్రభుత్వం ఆఫర్ ఇచ్చింది. దాంతో అతను ఎగిరిగంతేశాడు. ఈ జాక్ పాట్ కొట్టేసిన మర్ఫీ ఆనందానికి అవధుల్లేవు. ఈ డీల్ పై ప్రిజర్వ్ డైరెక్టర్ కోరీ ఎక్బా మాట్లాడుతూ, మర్ఫీ ఈ ప్రాంతానికి మంచి పొరుగు వ్యక్తని, ఆయన తర్వాత అలాంటి యజమానులే వస్తారన్న నమ్మకం లేదని, అందుకే ఈ డీల్ చేసుకున్నామని చెప్పారు. కాగా, మర్ఫీ తన జీవితాంతం ఆ ఇంట్లో ఏమాత్రం అద్దె చెల్లించక్కర్లేకుండా ఉండచ్చు. అయితే, ఇంటి నిర్వహణ, మరమ్మతుల బాధ్యత మాత్రం అతనే వహించాల్సి వుంటుంది.

  • Loading...

More Telugu News