: తొలుత ఇన్ఫోసిస్, ఇప్పుడు కాగ్నిజంట్... ఐటీ సెక్టారుకు వరుస దుర్వార్తలు!


భారత ఐటీ సెక్టారుకు వరుసగా దుర్వార్తలు వినిపిస్తున్నాయి. గడచిన పుష్కర కాలంలో శరవేగంగా ఎదుగుతూ వచ్చి, ఆర్థికమాంద్యం వేళ కూడా తలెత్తుకు నిలిచి సత్తా చాటిన ఐటీ దిగ్గజాలు, ఇప్పుడు ఆదాయ వృద్ధిలో ఆపసోపాలు పడుతున్నాయి. తొలుత ఇన్ఫోసిస్ సంస్థ తమ వార్షికాదాయ అంచనాలను తగ్గించగా, ఐటీ సెక్టార్ కంపెనీలన్నీ నష్టపోయిన సంగతి తెలిసిందే. బెంచ్ మార్క్ సూచికల గమనంతో పోలిస్తే ఐటీ ఇండెక్స్ తిరోగమనాన్ని చూపింది. ఇక న్యూజెర్సీ కేంద్రంగా పనిచేస్తూ, ఇండియాలో అత్యధికంగా ఐటీ ఉద్యోగులను నియమించుకుని సేవలందిస్తున్న కాగ్నిజంట్ సైతం అమ్మకాలు తగ్గుతున్నాయని, ఆదాయంపై ప్రభావం పడుతోందని షాకింగ్ న్యూస్ చెప్పింది. ఆర్థిక ఫలితాలను వెల్లడిస్తూ, 2016లో సంస్థ వృద్ధి 8.5 నుంచి 9.5 శాతం మధ్య ఉండవచ్చని చెప్పింది. కాగ్నిజంట్ సంస్థ వృద్ధి అంచనా ఇంత తక్కువ స్థాయిగా ఉండటం గత పదేళ్లలో ఇదే తొలిసారి. దశాబ్దకాలంగా రెండంకెల వృద్ధితో దూసుకు వచ్చిన కాగ్నిజంట్, ఈ యేడు సింగల్ డిజిట్ కు పరిమితం కానుందని నిర్మిల్ బ్యాంగ్ సెక్యూరిటీస్ వెల్లడించింది. ఓవైపు ఇన్ఫోసిస్ తో పాటు, కాగ్నిజంట్ వెలువరించిన ఆదాయ అంచనాలు ఇన్వెస్టర్ల సెంటిమెంట్ ను దెబ్బతీయడంతో ఐటీ కంపెనీల ఈక్విటీలు భారీగా నష్టపోయాయి. ఫలితాల సీజన్ మొదలైన జూలై రెండో వారంతో పోలిస్తే, ప్రస్తుతం ఐటీ ఇండెక్స్ 12 శాతం వరకూ నష్టపోయింది. ఈ రెండు ప్రముఖ సంస్థలకూ బీఎఫ్ఎస్ఐ (బ్యాంకింగ్ ఫైనాన్షియల్ సర్వీసెస్ అండ్ ఇన్స్యూరెన్స్) విభాగం నుంచి 33 శాతం ఆదాయం వస్తోంది. యూరప్ నుంచి కాగ్నిజంట్ కు 16 శాతం, ఇన్ఫోసిస్ కు 23 శాతం ఆదాయం వస్తుండగా, బ్రెగ్జిట్ అనంతరం నెలకొన్న భయాలూ సెంటిమెంట్ ను హరించాయి. భారత ఐటీ కంపెనీల ఈక్విటీలను విక్రయించాలని నిర్మల్ బ్యాంగ్ సెక్యూరిటీస్ సలహా ఇస్తుండగా, రెలిగేర్ తగు జాగ్రత్తతో ఈక్విటీల గమనాన్ని పరిశీలిస్తుండాలని సూచిస్తోంది.

  • Loading...

More Telugu News