: దేశంలో ప్రజాస్వామ్యం అంటే ఐదేళ్లు కాంట్రాక్టు ఇవ్వడం అన్నట్లుగా మారింది: ప్రధాని మోదీ
దేశంలో ప్రజాస్వామ్యం అంటే ఒకసారి ఓటు వేసి ఐదేళ్లు కాంట్రాక్టు ఇవ్వడం అన్నట్లుగా మారిందని ప్రధాని నరేంద్ర మోదీ అన్నారు. టౌన్‌హాల్ తరహాలో ఢిల్లీలోని ఇందిరా గాంధీ మైదానంలో నిర్వహిస్తోన్న ప్రజావేదికలో ఆయన ప్రజలతో ముఖాముఖిలో పాల్గొని సరికొత్త కార్యక్రమానికి శ్రీకారం చుట్టారు. సర్కారే అన్ని పనులు చేస్తుందనే అలసత్వం దేశ ప్రజల్లో ఉందని ఈ సందర్భంగా మోదీ అన్నారు. ప్రజాస్వామ్యంలో ప్రజల భాగస్వామ్యమే ముఖ్యమని ఆయన వ్యాఖ్యానించారు. స్వచ్ఛ భారత్‌లో ప్రజలు భాగస్వామ్యం కావడం ప్రజాస్వామ్యానికి నిదర్శనం అని మోదీ అన్నారు. కొన్ని వేల సంవత్సరాల వారసత్వం మనకుందని, టూరిజాన్ని అభివృద్ధి చేస్తే మన ఎకానమీ మరింత అభివృద్ధి చెందుతుందని మోదీ అన్నారు. సహజవనరులను ఎంత బాగా వాడుకుంటే అంత మంచిదని పేర్కొన్నారు. పెట్రోలియం ఉత్పత్తుల కోసం కొన్ని లక్షల కోట్లు ఖర్చు చేస్తున్నామని, సౌరవిద్యుత్ వినియోగం పెరగాలని ఆయన అన్నారు.