: బులంద్ షహార్ గ్యాంగ్ రేప్... అసలా రాత్రి ఏం జరిగింది? తల్లీబిడ్డల మానసిక క్షోభ!
దేశవ్యాప్తంగా సంచలనం సృష్టిస్తున్న తల్లీబిడ్డల గ్యాంగ్ రేప్ ఘటనలో దిగ్బ్రాంతి కలిగించే వాస్తవాలను బాధితులు పంచుకున్నారు. శుక్రవారం రాత్రి ఈ ఘటన జరుగగా, తమకు జరిగినట్టుగా మరెవరికీ జరుగకూడదని చెబుతూ, అసలా రాత్రి ఏం జరిగిందో, తామెలా మానసిక క్షోభను అనుభవించామన్న విషయాన్ని వివరించారు. సభ్య సమాజం సిగ్గుతో తలదించుకోవాల్సిన పరిస్థితే ఇది. ఢిల్లీ - కాన్పూర్ జాతీయ రహదారిపై బులంద్ షహర్ వద్ద జరిగిన ఘటనపై పోలీసులకు వారు వెల్లడించిన వివరాల ప్రకారం... * 91వ నంబర్ జాతీయ రహదారిపై బైపాస్ కు సమీపంలో ఘటన జరిగింది. * 13 రోజుల క్రితం మరణించిన తమ బంధువు ఇంటికి వీరు బయలుదేరారు. * దోస్త్ పూర్ గ్రామం సమీపంలోని చెట్ల పొదల్లో దుండగులు దాగి ఉన్నారు. * బాధిత కుటుంబం ప్రయాణిస్తున్న కారుపై ఐరన్ రాడ్డును విసిరారు. * వెంటనే కారును ఆపిన డ్రైవర్, ఏం జరిగిందో చూసేందుకు కారు దిగాడు. * వెంటనే చుట్టుముట్టిన దుండగులు తుపాకులు చూపి వారిని దోచుకున్నారు. * వీరు మొత్తం 12 మందికాగా, బాధితుల వద్ద ఉన్న రూ. 11 వేలతో పాటు నగలనూ దోచుకున్నారు. * అంతటితో వదలకుండా కారులోని నలుగురు పురుషులనూ కట్టేసి, 35 సంవత్సరాల తల్లిని, 14 సంవత్సరాల కుమార్తెనూ ఈడ్చుకుపోయారు. * ఆపై సామూహికంగా అత్యాచారం చేశారు. దాదాపు 3 గంటల పాటు ఈ ఘోరం జరిగింది. * ఆపై అపస్మారక స్థితిలో తల్లీబిడ్డలను వదిలి వెళ్లగా, ఎలాగోలా కట్లు విడిపించుకున్న వారి కుటుంబ సభ్యుడు ఒకరు మిగతావారిని విడిపించి వీరిని వెతికి గుర్తించారు. * ఆపై అర్ధరాత్రి తరువాత సెక్టార్ 68లోని తమ ఇంటికి చేరారు. * ఆపై శనివారం ఉదయం సమీపంలోని పోలీసు స్టేషన్ కు చేరి ఫిర్యాదు చేశారు. ఈ కేసులో ఇప్పటికే ముగ్గురు నిందితులను అరెస్ట్ చేశామని, మిగతా వారిని కూడా త్వరలోనే అదుపులోకి తీసుకుంటామని పోలీసు అధికారులు తెలిపారు.