: భీమవరంలో కేటీఆర్ ఫ్లెక్సీలు!... బర్త్ డే శుభాకాంక్షలు తెలుపుతూ వెలసిన హోర్డింగులు!
తెలంగాణ రాష్ట్ర సమితి (టీఆర్ఎస్) యువనేత, తెలంగాణ రాష్ట్ర కేబినెట్ లో కీలక మంత్రిగా వ్యవహరిస్తున్న కల్వకుంట్ల తారకరామారావుకు ఏపీలోనూ అభిమానం వెల్లువెత్తుతోంది. నిన్న ఆయన జన్మదినాన్ని పురస్కరించుకుని ఏపీలోని పశ్చిమగోదావరి జిల్లా భీమవరంలో ప్రత్యేకంగా ఫ్లెక్సీలు వెలిశాయి. కేటీఆర్ స్నేహితుల పేరిట పట్టణంలో మూడు చోట్ల భారీ ఫ్లెక్సీలు నిన్న ఉదయమే దర్శనమిచ్చాయి. తెలంగాణ వాసులకు భిన్నంగా కేటీఆర్ పేరును పూర్తిగా ‘కల్వకుంట్ల తారకరామారావు’గా ఫ్లెక్సీపై రాసిన ఆయన అభిమానులు ఫుల్ సూట్ లో ఉన్న కేటీఆర్ చిత్రాన్ని ఏర్పాటు చేశారు. టీఆర్ఎస్ అధినేత, కేటీఆర్ తండ్రి కేసీఆర్ చిత్రపటం కూడా ఈ ఫ్లెక్సీలపై ఓ మూలన దర్శనమిచ్చింది. ఈ ఫ్లెక్సీలపై నిన్న భీమవరం వ్యాప్తంగా పెద్ద చర్చే నడిచింది. గతంలో ఓ మారు భీమవరంలో తనకు స్నేహితులు ఉన్నారంటూ కేటీఆర్ చేసిన వ్యాఖ్యలు ఈ సందర్భంగా ఆ చర్చల్లో ప్రస్తావనకు వచ్చాయి. ఏదేమైనా, టీఆర్ఎస్ ను రాష్ట్ర విభజనకు కారణమైన పార్టీగా భావిస్తున్న ఏపీలో కేటీఆర్ కు బర్త్ డే విషెస్ తెలుపుతూ ఫ్లెక్సీలు ఏర్పాటు కావడం పెద్ద చర్చకు తెర తీసింది.