: ‘కబాలి’ విమాన ప్రయాణికులకు నిరాశ... మాట తప్పిన ‘ఎయిర్ ఏషియా’
‘కబాలి’ లుక్ తో ముస్తాబైన ఎయిర్ ఏసియా విమాన ప్రయాణికులకు నిరాశే ఎదురైంది. ఈ ప్రత్యేక విమానంలో టికెట్లు బుక్ చేసుకున్న ప్రయాణికులకు పలు రకాల సదుపాయాలు కల్పించడంతో పాటు చెన్నైలో ‘కబాలి’ సినిమా చూపిస్తామని వారికి మాట ఇచ్చి, ఇప్పుడు తప్పింది. 'ఎయిర్ ఏషియా' కంపెనీ ఈ సినిమాను చూపించే ప్రదేశంతో పాటు సమయాన్ని కూడా రీషెడ్యూల్ చేయడంతో, ‘కబాలి’ సినిమా విడుదలైన మొదటిరోజే ఈ చిత్రాన్ని చెన్నయ్ లో ప్రేక్షకుల మధ్య చూడాలనుకున్న విమాన ప్రయాణికులు నిరాశ పడుతున్నారు. చెన్నైలోనే తాము సినిమా చూడాలని ‘ఎయిర్ ఏషియా’ ప్రయాణికులు పట్టుబట్టినప్పటికీ ఫలితం లేకుండా పోయింది. ప్రస్తుతం అది సాధ్యం కాదని, సినిమా ప్రదర్శించే సమయం, ప్రాంతం మారిందని సదరు సంస్థ తెలిపింది. ఈ విషయంలో తాము చిన్న పొరపాటు చేశామని, అందుకుగాను ‘ఎయిర్ ఏషియా’లో టికెట్లు బుక్ చేసుకున్నవారికి నష్టపరిహారం చెల్లిస్తామని సంస్థ ప్రతినిధులు చెప్పారు. కాగా, ‘కబాలి’ పోస్టర్ తో రూపొందించిన ‘ఎయిర్ ఏషియా’ విమానం బెంగళూరు, న్యూఢిల్లీ, గోవా, పుణె, చండీగఢ్, జైపూర్, గువాహటి, ఇంఫాల్, వైజాగ్, కొచ్చి మీదుగా ప్రయాణిస్తుందని గతంలో సంస్థ అధికారులు ప్రకటించిన విషయం తెలిసిందే.