: ఆర్బీఐ గవర్నరుగా ఎవరు వచ్చినా కత్తి మీద సామే!
ఓ వైపు బ్రెగ్జిట్, మరోవైపు ద్రవ్యోల్బణం, ఇంకోవైపు బ్యాంకింగ్ సంస్కరణలు, చుట్టు ముట్టి వచ్చే వివిధ రాష్ట్రాల ఎన్నికలతో మారిపోతుండే రాజకీయ వాతావరణం మధ్య రఘురాం రాజన్ తర్వాత రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా గవర్నరుగా ఎవరు వచ్చినా 'కత్తి మీద సాము' చేస్తున్నట్టేనని నిపుణులు అభిప్రాయపడుతున్నారు. ఈ సంవత్సరం సెప్టెంబర్ నుంచి డిసెంబర్ మధ్య యూరోపియన్ యూనియన్ నుంచి బ్రిటన్ విడిపోయే ప్రక్రియ ప్రారంభం కానుండటంతో రూపాయి తీవ్ర ఒడిదుడుకులకు లోను కావచ్చని, దాన్నుంచి వ్యవస్థను కాపాడటమే కొత్త గవర్నర్ కు తొలి సవాలని అంటున్నారు. ఈ నెలాఖరులో సమావేశమయ్యే యూరోపియన్ సెంట్రల్ బ్యాంకు, బ్యాంక్ ఆఫ్ జపాన్, యూఎస్ ఫెడరల్ ఓపెన్ మార్కెట్ కమిటీలు సమావేశం కానుండగా, సమీప భవిష్యత్తులో తీసుకోవాల్సిన నిర్ణయాలపై ప్రపంచ బ్యాంకులకు కొంత మార్గనిర్దేశం లభించవచ్చని తెలుస్తోంది. గ్రేట్ బ్రిటన్ పౌండుతో పోలిస్తే, వివిధ దేశాల కరెన్సీ ఒడిదుడుకులపై ఇక్కడ చర్చించవచ్చని విశ్లేషకులు అంటున్నారు. డాలర్ బలపడితే, మిగతా అన్ని దేశాల కరెన్సీల మాదిరిగానే యువాన్ సైతం పడిపోతుండటం, జపాన్ తో చెప్పుకోతగ్గ వాణిజ్యమున్న ఇండియా వంటి దేశాలకు ఇబ్బందికరమని, దీన్ని సరిదిద్దాల్సిన బాధ్యత ఆర్బీఐపైనే అధికమని వివరించారు. కరెన్సీ ఒడిదుడుకులను పక్కన పెడితే, ఆర్బీఐకున్న మరో ఇబ్బంది ద్రవ్యోల్బణం పెరగడం. వినియోగ ధరల సూచి ఆధారిత ఇండెక్స్ తో పాటు, టోకు ధరల సూచికలు సైతం గత కొంతకాలంగా పెరుగుతూ ఉన్నాయి. బ్రెగ్జిట్ అమల్లోకి వస్తే, కరెన్సీలపై పడే ఒత్తిడి వస్తు ఉత్పత్తుల ధరలను సైతం పెంచుతాయి. ఫలితంగా ఇన్ ప్లేషన్ సైతం ముందుకే సాగుతుంది. వర్షాలు బాగుండి ఆహార ద్రవ్యోల్బణం వరకూ సాధారణంగా ఉన్నప్పటికీ, మిగతా విభాగాల్లో ధరలు గణనీయంగా పెరుగుతాయని ఎకానమిస్టులు హెచ్చరిస్తున్నారు. ద్రవ్యోల్బణాన్ని కట్టడి చేయాలంటే, వడ్డీ రేట్లను పెంచాల్సి వుంటుంది. వ్యవస్థలో చెలామణి నుంచి నగదును వెనక్కు తీసుకోవాలి. ఫలితంగా వృద్ది మందగిస్తుంది. ఇవన్నీ ఒకదానికి ఒకటి బంధాన్ని కలిగివుండటంతో ఆర్బీఐ గవర్నర్ సమతుల్యం సాధించడం ఓ సవాలే. మరో ప్రధాన సమస్య బ్యాంకుల్లో కష్టాలు. నిరర్థక ఆస్తుల మొత్తం రూ. 5.81 లక్షల కోట్లకు పెరగడం, చాలా బ్యాంకుల వద్ద మూలధనపు నిల్వలు లేకపోవడం కూడా కొత్త గవర్నర్ ముందు సమస్యగా నిలువనుంది. ఆర్థిక రంగంలో మంచి అనుభవం, దేశ వ్యవస్థపై సరైన అవగాహన ఉన్న ఆర్థిక వేత్తలకు ఈ సమస్యలు చిన్నవే అయినప్పటికీ, మారే రాజకీయ పరిణామాలు, వచ్చే విమర్శలు, వడ్డీ రేట్లపై ఒత్తిడి తదితరాంశాలకు ఎదురొడ్డి నిలవడం మాత్రం అంత సులభం కాదని విశ్లేషకుల అభిప్రాయం.