: ఏడాదిలో రెట్టింపు లాభాన్నిచ్చిన 'మన్ పసంద్' ఈక్విటీ!
మన్ పసంద్ బీవరేజస్... ఐపీఓకు వచ్చి వాటాలమ్మి తొలిసారిగా జూలై 9, 2015న భారత మార్కెట్లో లిస్టింగ్ అయిన సంస్థ. ఈ కంపెనీ ఈక్విటీ ఇష్యూ విలువ రూ. 320 కాగా, ఇప్పుడది రూ. 712. అంటే దాదాపు ఏడాది వ్యవధిలో నమ్ముకున్న ఇన్వెస్టర్ల సొమ్మును రెట్టింపు చేసిందన్నమాట. ఇక గడచిన రెండు నెలల వ్యవధిలో సెన్సెక్స్ 9 శాతం పెరుగగా, మన్ పసంద్ ఈక్విటీ విలువ 42 శాతం పెరిగింది. ఓఆర్ఎస్ బ్రాండ్ గా యాపిల్ సిప్, ప్యూర్ సిప్ తదితర శీతల పానీయాలతో పాటు శుద్ధి చేయబడ్డ మంచి నీటిని ఈ సంస్థ విక్రయిస్తోంది. గత నాలుగు త్రైమాసికాల్లో సంస్థ ఆదాయ, లాభాలు అద్భుతమని, అందువల్లే ఆ ప్రభావం ఈక్విటీపై కనిపించిందని విశ్లేషకులు వ్యాఖ్యానించారు. ఇండియాలో బీవరేజస్ వ్యాపారం గణనీయంగా పెరుగుతున్న ప్రస్తుత తరుణంలో, భవిష్యత్తులో కంపెనీ ఈక్విటీ మరింతగా పెరగవచ్చని అంచనా వేస్తున్నారు.