: పరుగు పెడుతున్న ట్రావెల్స్ బస్సులో మంటలు... కిందకు దూకేసి ప్రాణాలు కాపాడుకున్న ప్యాసెంజర్లు
నేటి తెల్లవారుజామున పెద్ద ప్రమాదమే తప్పింది. స్పీడుగా దూసుకెళుతున్న ఓ ప్రైవేట్ ట్రావెల్స్ బస్సులో ఉన్నట్టుండి మంటలు చెలరేగాయి. అయితే క్షణాల్లో అప్రమత్తమైన ప్రయాణికులంతా బస్సు రన్నింగ్ లో ఉండగానే కిందకు దూకేసి ప్రాణాలు దక్కించుకున్నారు. ప్రయాణికులను పెను భయాందోళనకు గురి చేసిన ఈ ఘటన హైదరాబాదు శివారు ప్రాంతం కీసర సమీపంలో చోటుచేసుకుంది. వివరాల్లోకెళితే... హైదరాబాదు నుంచి 40 మంది ప్రయాణికులతో కార్తీక్ ట్రావెల్స్ బస్సు కాకినాడకు బయలుదేరింది. కీసర వద్దకు చేరుకోగానే బస్సులో ఉన్నట్లుండి మంటలు చెలరేగాయి. అప్పటికే చాలా మంది ప్రయాణికులు నిద్రలోకి జారుకున్నా... మెలకువగా ఉన్న కొందరు వేగంగా స్పందించారు. బస్సులో మంటలు చెలరేగిన విషయాన్ని డ్రైవర్ కు చెప్పిన వారు నిద్రలో ఉన్న ప్రయాణికులను తట్టి లేపారు. అంతా కలిసి బస్సు నుంచి కిందకు దూకేశారు. ఈలోగా బస్సును డ్రైవర్ ఓ పక్కగా ఆపేశాడు. ఆగీ ఆగగానే ఆ బస్సును మంటలు దహించివేశాయి. దీంతో నడిరోడ్డుపైనే బస్సు పూర్తిగా కాలిపోయింది. షార్ట్ సర్క్యూట్ కారణంగానే ఈ ప్రమాదం చోటుచేసుకున్నట్లు సమాచారం.