: రోగి బతకడని డాక్టర్లు తేల్చినా బీమా ఇవ్వాల్సిందే: పంజాబ్ అండ్ హర్యానా కోర్టు కీలక తీర్పు


వైద్యం చేయించుకుంటున్న వ్యక్తి మరణిస్తాడని డాక్టర్లు తేల్చి చికిత్స ఆపేసిన తరువాత, సదరు వ్యక్తి ప్రాణాలు వదిలితే బీమా సొమ్ము ఇవ్వాల్సిందేనని పంజాబ్ అండ్ హర్యానా హైకోర్టు కీలక తీర్పిచ్చింది. రోగి చికిత్స చేయించుకోకుండా మరణించాడని, అందువల్ల పరిహారం చెల్లించలేమని ఓరియంటల్ ఇన్స్యూరెన్స్ కంపెనీ లిమిటెడ్ చేసిన వాదనపై విచారణ జరిపిన న్యాయస్థానం, ఆ వాదనను కొట్టి పారేస్తూ, రూ. 35.46 లక్షల రూపాయల బీమా సొమ్ము చెల్లించాలని తీర్పిచ్చింది. ఈ విషయంలో చికిత్స తీసుకోకపోవడం రోగి ఇష్టంతో జరిగినది కాదని, అతని శరీరం సహకరించకపోవడమేనని, ఈ విషయంలో పాలసీదారు తప్పు ఏంటని న్యాయమూర్తి జస్టిస్ కన్నన్ ప్రశ్నించారు. కాగా, ఈ తీర్పుతో ఇక చికిత్స అవసరం లేదని ఎన్నో ఏళ్లుగా ట్రీట్ మెంట్ మానేసిన రోగులకు సైతం మరణించిన తరువాత బీమా లభిస్తుందని ఈ రంగంలోని నిపుణులు వ్యాఖ్యానించారు. వీరికి బీమా సొమ్మును ఎగ్గొడుతున్న కంపెనీల ఆటలు ఇక సాగవని వైద్య నిపుణులు పేర్కొన్నారు. ఎంతో వైద్య ఖర్చులను భరించి కూడా తమవారిని కాపాడుకోలేకపోయిన వారికి ఈ తీర్పు పెద్ద రిలీఫ్ అనడంలో సందేహం లేదు.

  • Loading...

More Telugu News