: 'స్టార్ బక్స్' కాఫీలో ఐస్ ఎక్కువైందట ...33 కోట్లు చెల్లించాలంటూ కోర్టుకెక్కిన వనిత
సాధారణ కాఫీ ఐదు నుంచి పది రూపాయలకు దొరుకుతుంది. అదే ఓ కాఫీ పాష్ కి వెళ్లి తాగితే డిఫరెంట్ ఫ్లేవర్లు అంటూ జేబులు ఖాళీ చేస్తారు. మన దేశంలో కాఫీ డే, బరిస్టా తరహాలో అమెరికాలో 'స్టార్ బక్స్' కాఫీకి మంచి ఆదరణ ఉంది. దీనిని ఆసరా చేసుకుని స్టార్ బక్స్ కంపెనీ నిలువుదోపిడీ చేస్తోందని షికాగోకు చెందిన స్టాసీ పింకస్ అనే మహిళ ఆరోపిస్తోంది. స్టార్ బక్స్ కంపెనీ అడ్వర్టైజ్ మెంట్లు, మెనూలో పేర్కొంటున్న విధంగా కాఫీని అందజేయడం లేదని ఆమె పేర్కొన్నారు. ఐస్ కాఫీలో 24 ఔన్సుల కాఫీ ఉంటుందని పేర్కొన్న స్టార్ బక్స్ కంపెనీ వాస్తవానికి 14 ఔన్సుల కాఫీ మాత్రమే అందజేస్తోందని, మిగిలినదంతా ఐసేనని మండిపడింది. వినియోగదారులను ఐస్ బక్స్ దారుణంగా మోసం చేస్తోందని ఆమె తెలిపారు. ఇంత పెద్ద మోసానికి పాల్పడుతున్న స్టార్ బక్స్ కంపెనీ తనకు 5 మిలియన్ డాలర్లు (33.18 కోట్ల రూపాయలు) చెల్లించాలని ఫెడరల్ కోర్టును ఆమె ఆశ్రయించారు. అంతే కాకుండా హాట్ కాఫీ కంటే కోల్డ్ కాఫీలకు స్టార్ బక్స్ కంపెనీ ఎక్కువ ధర నిర్ణయించిందని ఆమె అందులో పేర్కొన్నారు. కాగా, ఆమె ఆరోపణలను స్టార్ బక్స్ తేలిగ్గా తీసుకుంది. ఆమె వాదనలో పసలేదని తెలిపింది. ఐస్ కాఫీ అంటే ఐస్ ఎక్కువ ఉండాలని వినియోగదారులు భావిస్తారని స్టార్ బక్స్ పేర్కొంది. తాము కాఫీని తయారు చేసే విధానం వినియోగదారులను సంతృప్తి పరచని పక్షంలో ఆ విధానం మారుస్తామని స్టార్ బక్స్ తెలిపింది.